విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ క‌థ కంచికేనా ?  

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ క‌థ కంచికేనా ?  

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ అంశంపై  వెన‌క్కి త‌గ్గే ప్రపక్తే  లేద‌ని పార్లమెంట్​  సాక్షిగా కేంద్ర ప్రభుత్వం  తేల్చి చెప్పింది.   తెలుగుదేశం పార్టీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు  బ‌దులిస్తూ నూటికి నూరుశాతం ప్రైవేటీక‌రిస్తామ‌ని న‌రేంద్ర మోడీ  స‌ర్కార్ తెగేసి చెప్పింది.   ప్రైవేటీక‌ర‌ణ ప్రతిపాదనకు  వ్యతిరేకంగా  ఒక వైపు విశాఖ‌లో నిర‌స‌న‌లు,  ధ‌ర్నాలు కొనసాగుతుండ‌గానే మ‌రో వైపు  ఎవ‌రెన్ని   ఉద్యమాలు  చేసినా  ప్రైవేటీక‌ర‌ణ జ‌రిపి తీరుతామ‌ని కేంద్ర ప్రభుత్వం  లిఖిత‌పూర్వకంగా తేల్చి చెప్పింది.   దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై   ఆంధ్రులు అంతిమంగా త‌మ హ‌క్కు  కోల్పోయిన‌ట్లే అనిపిస్తోంది.  

ఉక్కు ఫ్యాక్టరీది  పోరాటాల చ‌రిత్ర 
 తెలుగు ప్రజల  ఐక్యతకు ,  పౌరుషానికి,  పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.  త‌మ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వ‌స్తే చ‌దువుకున్న యువ‌తీ యువ‌కుల‌కు  ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్ర కు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు.  భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు.  ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని  కేంద్ర ప్రభుత్వం నడిబజారులో అమ్మకానికి పెడితే,  ఆంధ్ర ప్రదేశ్​ లోని రాజ‌కీయ పార్టీల‌న్నీ ఒక‌తాటిపై నిల‌బ‌డి పోరాటం చేస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు.  అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.   స్టీల్ ప్లాంట్ ను అడ్డం పెట్టుకుని అన్ని పార్టీలు వాళ్ల వాళ్ల రాజ‌కీయాలు చేసుకున్నారు.   ఇందులో ఏ ఒక్క రాజ‌కీయ పార్టీకి మిన‌హాయింపు లేదు.  ఫ్యాక్టరీ సంగ‌తి గాలి కొదిలేసి  అధికారంలో ఉన్న  వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిదంతా చేసింది.   దీనికి కౌంట‌ర్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఉత్తరాంధ్ర ద్రోహిగా జ‌నం ముందు నిల‌బెట్టింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ.  


టీడీపీ టార్గెట్ జ‌గ‌నే....
ఉక్కు ఫ్యాక్టరీ అంశం తెలుగుదేశం పార్టీకి ఓ వరంలా వచ్చింది.  తిమ్మిని బమ్మిని చేయగల శక్తియుక్తులు ఉన్నాయని అందరూ భావించే చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూను అడ్డం పెట్టుకుని అటు కేంద్ర ప్రభుత్వాన్ని... ఇటు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను జనం ముందు దోషులుగా నిలబెడతారని జనం ఆశించారు. అయితే వారి ఆశలపై చంద్రబాబు  నీళ్లు చల్లారు.  స్టీల్ ప్లాంట్ ఇష్యూ పై చంద్రబాబు ఏమాత్రం దూకుడు ప్రదర్శించడం లేదన్నది బ‌హిరంగ ర‌హ‌స్యమే.  అసలు స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది మానేసి,  వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను,  ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చంద్రబాబు   టార్గెట్ చేశారు. 


ఉద్యమంలో ఎవ‌రి లెక్కలు  వాళ్లవి 
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విష‌యంలో ఎవ‌రి లెక్కలు  వారివే అన్నట్లుగా  వ్యవహరించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్,  తెలుగుదేశం పార్టీలు.  ఉక్కు ఫ్యాక్టరీ ఇష్యూతో చంద్రబాబు జనంలోకి వెళితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి  వ్యతిరేకి అంటూ తనపై పడ్డ మచ్చను సునాయాసంగా చెరిపేసుకునే వీలుండేది.  అయితే చంద్రబాబు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు.  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనకుండా,   ఇష్యూతో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేయడంపైనే ఫోకస్ పెట్టారు.   టీడీపీ అందివచ్చిన అవకాశాన్ని చేతులారా జారవిడుచుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.    ప్రైవేటీకరణ అంశాన్ని.....జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో బద్నాం చేయడం వరకే ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబు  ప్లాన్ లా క‌నిపించింది.   కేంద్ర ప్రభుత్వాన్ని బోనెక్కించాలని చంద్రబాబు  అనుకోలేదు.  అలాంటి ప్రయ‌త్నాలు  చేస్తే అది ఏకంగా నరేంద్ర మోడీ,  అమిత్ షా లను సవాల్ చేయడమే అవుతుంది.  అదే జరిగితే....కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోపం రావచ్చు. ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో వైరం తెచ్చుకునే ప్రయత్నాలేవీ చంద్రబాబు చేయరు.   ఇలా అన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ,  ఉక్కు ఫ్యాక్టరీ ఇష్యూ పై ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించి సైలెంట్ అయిపోయారు చంద్రబాబు. 


వ్యూహాత్మకంగా అడుగులు వేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 
ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా   అడుగులు వేశారు.  ప్రైవేటీకరణ అంశం బయటకు రాగానే,  అసలు స్టీల్ ప్లాంట్ కు ఎందుకు నష్టాలు వస్తున్నాయో వివరిస్తూ...అలాగే నష్టాలు రాకుండా ఏమేం చేయాలో కొన్ని సలహాలు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి  ఓ లేఖ రాశారు. అవసరమైతే ఫ్యాక్టరీని కార్పొరేట్ శక్తులకు అమ్మకుండా,  రాష్ట్ర ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకుంటుందన్నారు.  ఎలాంటి పరిస్థితుల్లోనూ  ప్రైవేటీకరణను జరగనిచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రజలకు సంకేతాలు పంపి చేతులు దులుపుకున్నారు.    


ఉత్తరాంధ్ర మ‌ణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్ 
ఉక్కు ఫ్యాక్టరీ.... దాదాపు లక్షమందికి అన్నం పెడుతున్న ఓ పారిశ్రామిక సంస్థే కాదు.  ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ సంస్థతో ఎమోష‌న‌ల్ అటాచ్ మెంట్ ఉంది. ఆ అనుబంధం, రాజ‌కీయాల కంటే చాలా చాలా గొప్పది.  విశాఖ నగరానికి మణిహారం వంటిది స్టీల్ ప్లాంట్.  అలాంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతను  అన్ని రాజకీయ పార్టీలు తుంగ‌లో తొక్కాయి.    ఏదేమైనా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవ‌డం కంటే అయిన‌కాడికి తెగ‌న‌మ్ముకోవ‌డ‌మే కేంద్ర ప్రభుత్వ  విధానంగా క‌నిపిస్తోంది.   
 ఎస్. అబ్దుల్ ఖాలిక్,  63001 74320  సీనియ‌ర్  జ‌ర్నలిస్ట్​