అంత తక్కువ దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటి? 

అంత తక్కువ దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటి? 

అమరావతి: అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకంత అభద్రతా భావమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. సీఎం జగన్‌ తెనాలి పర్యటనకు వస్తుంటే జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ఆయన నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా సీఎంకు భయమని.. అందుకే ఆయన తెనాలి పర్యటనకు వస్తుంటే ఇవాళ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు. మరోవైపు తాడేపల్లి నుంచి తెనాలికి జగన్‌ హెలికాప్టర్‌లో వెళ్లడాన్ని మనోహర్‌ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  ''రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని సీఎం హెలికాప్టర్‌లో వెళ్తున్నారా? జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి తెనాలికి 28కి.మీ మాత్రమే ఉంటుంది. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? అంత తక్కువ దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటి? జనం నవ్వుకుంటున్నారు. జనం సొమ్ము సీఎం హెలికాప్టర్ల పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్‌కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగవుతాయి. ప్రజల్ని గతుకు రోడ్ల పాల్జేసి.. జగన్‌ హెలికాప్టర్‌లో తిరుగుతున్నారు'' అని నాదెండ్ల విమర్శించారు.