తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా

తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా
  • తుంగతుర్తి లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది.
  • సుమారు 5 లక్షల మందికి పైగా తుంగతుర్తి వంద పడకల ఆసుపత్రి ద్వారా వైద్య సహాయం పొందవచ్చు.
  • తుంగతుర్తి మండల పరిధిలోని పలు ప్రధాన రహదారుల పునర్నిర్మాణం తక్షణమే చేపడతాం.
  • నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సహకారం తీసుకుంటా.
  • తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు


తుంగతుర్తి ముద్ర:- ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి వ్యక్తికి ఆరోగ్యం సరిగా ఉంటే అంతకన్నా మహాభాగ్యం ఏది లేదని అందుకే పేద ప్రజానీకానికి అవసరమైన వైద్య సదుపాయం అందుబాటులో ఉండడానికి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు .సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కానున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే తుంగతుర్తి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధిత శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహతో మాట్లాడి కావలసినన్ని నిధులు మంజూరు చేయాలని కోరామని అందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణప్రారంభం సత్వరమే నిర్వహించడం జరిగిందని అన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వచ్చే 18 నెలల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అవుతుందని తద్వారా సుమారు 5 లక్షల మందికి పైగా పేద ప్రజానీకానికి వైద్య సేవలు   అందుతాయని అన్నారు . నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి ,నాగారం ,మద్దిరాల ,నూతనకల్ మండలాలతో పాటు పక్క జిల్లాల నుండి సమీప గ్రామాల ప్రజలకు కూడా వైద్య సదుపాయం అందుతుందని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి లేక మెరుగైన వైద్యం కోసం 40 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేటకు పేద ప్రజల వైద్యానికి వెళ్లవలసి వచ్చేదని ప్రస్తుతం నిర్మాణం జరగనున్న  వంద పడకల ఆసుపత్రి తో పేద ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటుందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో వైద్య రంగంతో పాటు విద్య, రవాణా, తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ రంగాలను గణనీయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఈ ఐదు రంగాలు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు ఏలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అందుకే ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం సైతం నాణ్యంగా జరిపించాలని అధికారులు అనుక్షణం అప్రమత్తతతో మెలిగి నిర్మాణాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని అన్నారు. నిర్మాణంలో లోపాలున్నట్లయితే భవన నిర్మాణం లోపభూ భూఇష్టమవుతుందని దానితో పేద ప్రజలకు వైద్య సౌకర్యం కొరబడుతుందని అన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ అధికారులు సంబంధిత ఇంజనీర్లు తగిన విధంగా నిర్మాణాన్ని జరిగేలా చూడాలని అన్నారు. జిల్లా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే తుంగతుర్తి మండలంలోని పలు రోడ్ల నిర్మాణాలకు త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని తుంగతుర్తి అంబేద్కర్ సెంటర్ నుండి వెంపటి  రోడ్డు అలాగే నేషనల్ హైవే 365 వరకు వెలుగు పల్లి రోడ్డు అదేవిధంగా సంగం కోడూరు  రోడ్లను త్వరలోనే మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యం మెరుగు పడితేనే ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం తుంగతుర్తి చేరుకోగలుగుతారని అందుకోసం రోడ్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు .ప్రతి ఆవాసం, తండా నుండి నియోజకవర్గ కేంద్రానికి రోడ్డు అనుసంధానం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల సలహాలు సూచనలు తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తామని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం గ్రామ గ్రామం లో తాను ఉద్యమ కాలంనాడు పర్యటించానని ఎక్కడ ఏ సమస్య ఉందో తనకు అవగాహన ఉందని అంచెలంచెలుగా ఆ సమస్యలను పరిష్కరిస్తానని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని ప్రజల  హర్షద్వారాల మధ్య ఎమ్మెల్యే ప్రకటించారు. రానున్న కాలంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి ముందు ఆసుపత్రి నిర్మాణ స్థలంలో ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం ఎమ్మెల్యేను వైద్యాధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు,డి ఎం అండ్ హెచ్ ఓ కోటాచలం ,వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ నిర్మల్  కుమార్ , తహసిల్దార్ వెంకటరెడ్డి , ఎంపీడీవో భీమ్ సింగ్ , లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు ,మద్దిరాల మండల పార్టీ అధ్యక్షులు ముక్కాలఅవిలమల్లు ,జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి మాన్సింగ్,  మాజీ మండల పార్టీ అధ్యక్షులు మద్ది కృష్ణమూర్తి ,పెద్ద బోయిన అజయ్, వీరబోయిన రాంబాబు, కొండరాజు ,కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ ,ముత్యాల వెంకన్న ,దీప్లా  నాయక్ ,  రాజేందర్ రెడ్డి,లతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.