20 నెలల కొడుకుతో సిగరెట్ కాల్పించి, మద్యం తాగిస్తున్న తల్లి అరెస్టు

20 నెలల కొడుకుతో సిగరెట్ కాల్పించి, మద్యం తాగిస్తున్న తల్లి అరెస్టు

అస్సాం: ఇది ఒక అత్యంత విచారకరమైన సంఘటన. అస్సాంలోని సిల్చార్‌కు చెందిన ఒక మహిళ తన 20 నెలల శిశువును సిగరెట్ తాగమని, మద్యం తాగమని బలవంతం చేసింది. సిల్చార్‌లోని చెంగ్‌కురిట్‌లో జరిగిన ఈ సంఘటనపై స్పందించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు స్థానిక చైల్డ్ హెల్ప్‌లైన్ సెల్ రంగంలోకి దిగడంతో, ఆ తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. బిడ్డకు ఆమె సిగరెట్ నోట్లో పెట్టడం, మద్యం తాపించడం వంటి ఫొటోగ్రాఫ్స్ తో స్థానికులు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు అందుకున్న కొద్ది సేపటికే పోలీసులు మహిళ నివాసానికి చేరుకుని, బిడ్డను రక్షించి, విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను పొగబెట్టి, మద్యం తాగించి వేధిస్తున్న సంఘటన తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తల్లిని అదుపులోకి తీసుకుని బిడ్డను రక్షించామన్నారు. పిల్లల భద్రత కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తల్లి మరియు బిడ్డను తాత్కాలికంగా అదుపులోకి తీసుకుంది. అందుబాటులో ఉన్న ఏవైనా సాక్ష్యాలను సమీక్షించడం మరియు తల్లిని ఇంటర్వ్యూ చేయడంతో సహా సమగ్ర విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమమైన చర్యను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఈ విషయం వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆ తల్లిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.