యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం

యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం

ముద్ర ప్రతినిధి, భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు స్వస్తివాచనం, పుణ్యాహవచనం, విశ్వక్సేనారధనతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉదయం ఆలయం మొత్తం శుద్ధజలంతో సంప్రోక్షణ చేశారు. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన స్వామి అమ్మవారల ఉత్సవమూర్తులను ముఖమండప ఆలయంలో ఉంచి స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం వేదమంత్రాలతో ధూపదీపములు సమర్పించి స్వామి అమ్మవారలకు కంకణధారణ చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, భక్తులకు రక్షా కంకణములను అందించారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురారోపణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ  అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈఓ ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.