ఎల్లమ్మ గుడిలో దొంగలు పడ్డారు

ఎల్లమ్మ గుడిలో దొంగలు పడ్డారు
  • కల్లు కుండలు ధ్వంసం చేసిన దుండగులు
  • ఆర్థికంగా నష్టపోయిన గీతా కార్మికులు

ముద్ర, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో పలుచోట్లలో దొంగలు పద్దారు.స్థానిక గీతా కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.చీకోడు గ్రామంలోని స్థానిక ఎల్లమ్మ గుడిలో మంగళవారం రాత్రిపూట గుడి తాళం పగులగొట్టిన దొంగలు హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు దొంగిలించారు. అనంతరం దగ్గరలోని కల్లు మండపంలోని  కల్లు లొట్లు (కల్లు కుండలు ) పగలగొట్టారు. పగిలిపోయిన కల్లు లొట్ల ఖరీదు దాదాపుగా నలభై వేల రూపాయల వరకు ఉంటాయని సంఘం పెద్దలు గున్నాల గణేష్ తెలిపారు. సమీపంలో ఉన్న పొలాల్లో పండించిన పది కిలోల పచ్చి మిరపకాయలని కూడా కోసుకెళ్లారు.

వీటితో పాటు దగ్గరలోని గొర్రెల మందలో నుండి ఆరు గొర్లని ఎత్తుకెళ్లారు. రాత్రికి రాత్రి దొంగలు పలుచోట్లలొ దోచిన సొమ్ము దాదాపుగా లక్ష రూపాయల వరకు ఉంటుందని తేలింది.ఇంతటితో ఆగని దొంగలు ఆలయ సమీపంలో గల గోడలపై ఇది ఆరంభం మాత్రమే అంటూ లిఖిత పూర్వక హెచ్చరికలు చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దొంగతనం ఆకతాయిల పనా? లేక ఉద్దేశ్యపూర్వకంగా నష్టం కలిగించారా అనే నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్నారు.దొంగల కోసం గ్రామంలోని సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నట్లుగా ఎస్ ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.