ఎమ్మెల్యే చిన్నయ్య బాటలో యువ నేత

ఎమ్మెల్యే చిన్నయ్య బాటలో యువ నేత
  • వివాహితను వేధించిన యువనాయకుడు
  • పోలీసులను ఆశ్రయించిన యువతి
  • ఎమ్మెల్యే దివాకర్ రావుకు తలపోటుగా వరస ఘటనలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  ఓవైపు శాసనసభ ఎన్నికలు ముందున్న తరుణంలో కొంత మంది బీఆరెస్ నేతల తీరు ఆపార్టీకి తలపోటుగా మారింది. భూకబ్జాలు, అక్రమ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆరెస్ తాజాగా మహిళలను వేధిస్తోందన్న అభియోగాలను మూటకట్టుకుంటోంది.ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ యువతి బెల్లంపల్లి నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చేపట్టింది. చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తూ, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టి భయపెడుతున్నాడని ఢిల్లీలోని బీఆరెస్ కార్యాలయం ముందు కొద్దిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఆ సంఘటన తో జిల్లా బీఆరెస్    లో అలజడి రేకెత్తగా  ప్రజల్లో కొంత పలుచున అయ్యింది. చిన్నయ్య ను ఆ సమస్య నుంచి ఎలా గట్టెక్కించాలని అధిష్టానం తలపోస్తుండగా తాజాగా మంచిర్యాల కు చెందిన బీఆరెస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 


ప్రవీణ్ వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆయనపై ఆరోపణలు చేస్తూ పోలీస్ లను ఆశ్రయించింది. తన ఇంటి వీధిలో నివాసం ఉన్న  భార్య ,భర్తల మధ్య వివాదం తలెత్తి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీస్ స్టేషన్లో పలుకుబడి ఉందని వివాహితను నమ్మించాడు. ఓ వైపు వివాహితకు మద్దతు ఇస్తూనే మరోవైపు ఆమె భర్తకు అండగా నిలిచాడు. ప్రవీణ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాత్రి వేళ వాట్సాప్ కాల్ చేయడం, చాటింగ్ చేయడం, ఎవరు లేని సమయంలో ఫోన్ చేయాలని మెసేజ్ లు పెట్టాడు. అతని దుర్భుద్ధిని గ్రహించిన మహిళ మంగళవారం పోలీస్ లను ఆశ్రయించింది. ప్రవీణ్ వ్యవహారం బట్టబయలు కావడంతో బీఆరెస్ లో అలజడి మొదలైంది. బీఆరెస్ నేతల పాడు పనులను మహిళలు ఈసడించుకుంటున్నారు. మహిళలను వేధిస్తున్నారనే అభియోగాలు ఇప్పటికే కొంత మంది బీఆరెస్ నేతలపై ఉన్నాయి. 

సంకటంలో ఎమ్మెల్యే 

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో బహిరంగంగా జరిగిన అవమానం నుంచి తేరుకొని ఎమ్మెల్యే దివాకర్ రావు కు తాజాగా ప్రవీణ్ వ్యవహారం మరింత శిరోభారంగా మారింది. ఇటీవల నస్పూర్ వచ్చిన సందర్భంగా కేసీఆర్ సభ అనంతరం ఎమ్మెల్యే అతన్ని శాలువతో సత్కరించేందుకు ప్రయత్నించగా ఏమి వద్దు అంటూ చేయితో నెట్టి వేశాడు. ఆ ఘటన వీడియో సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే  మనస్థాపం చెందగా మరోవైపు ఎమ్మెల్యేకు టికెట్ కష్టమేనని ప్రత్యర్ధులు గళం ఎత్తారు. చలన చిత్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పుస్కురి రామ్మోహనరావు పోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అతన్ని పార్టీ క్యాడర్ కు, ప్రజలకు దూరం చేయాలని ఎమ్మెల్యే  ప్రయత్నాలు చేస్తుంటే ప్రవీణ్ వివాహితను వేధిస్తున్నాడని ఆరోపణలు బయటకు రావడంతో ఎలా మ్యానేజ్ చేయాలంటూ తలపట్టుకున్నాడు.