విద్యుదాఘాతంతో యువకుని దుర్మరణం - మరో ఇద్దరి పరిస్థితి విషమం

విద్యుదాఘాతంతో యువకుని దుర్మరణం - మరో ఇద్దరి పరిస్థితి విషమం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గడ్డి లోడ్ తో మహారాష్ట్రకు వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ సమీపంలో మంగళ వారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా భోకర్ తాలుకా రేనాపూర్ రైతులు కామోల్ లో గడ్డి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్న క్రమంలో ఈ ఘటన సంభవించింది. గడ్డి కట్టలతో వెళుతున్న లారీకి రోడ్డు పక్క నుంచి వెళుతున్న విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్  ఆదిత్య వపన్ భగత్ (30) కిందకు దిగి ఇనుప కడ్డీతో మంటలు చెలరేగిన గడ్డికట్టలను తొలగించే యత్నం చేశాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయ్యాడు. లారీ లోపలి భాగంలో కూర్చున్న మహారాష్ట్రవాసులు రోహిదాస్ (40), ఆకాష్ (38)లతో పాటు కామోల్ గ్రామాని కి చెందిన శంకర్ (35)లు సైతం విద్యుదాఘాతం బారిన పడ్డారు. ఇందులో రోహిదాస్, ఆకాష్ లఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వీరిరువురిని వైద్యం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.