పొత్తా? విలీనమా? తడబడుతున్న షర్మిల అడుగులు

పొత్తా? విలీనమా? తడబడుతున్న షర్మిల అడుగులు
  • కాంగ్రెస్ తో కలుస్తున్నారని ప్రచారం 
  • డీకేతో కొనసాగుతున్న వరుస భేటీలు
  • దీంతో బలపడుతున్న అనుమానాలు
  • రాష్ట్ర రాజకీయాలో దీనిపై వాడీవేడి చర్చ
  • పార్టీని విలీనం చేయాలని కోరుతున్న కాంగ్రెస్!
  • ఏపీలోనూ బలపడతామని హైకమాండ్ సూచన
  • ఎటు తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్ టీపీ చీఫ్
  • ఏదీ నిజం కాదంటున్న పార్టీ శ్రేణులు


ముద్ర, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర రాజ‌కీయాలలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ‌కీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికలలో విజయం సాధించేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగానే  పొత్తుల విష‌యాన్ని కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తపరుస్తూనే, కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇతర పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  చివరి నిమిషం వరకు కొనసాగిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తున్నట్లుగా  రాజకీయవర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. షర్మిల సోమవారం బెంగళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ తో భేటీ కావడం ఇందుకు ఊతమిస్తోంది. ఇప్పటికే ఆమె రెండు సార్లు శివకుమార్ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
 
కీలకంగా మారాలని
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏర్పడే నూతన ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని షర్మిల భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ తో జతకట్టాలని  భావిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ పాలన మీద  ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం మంచిదన్న భావనలో ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలతో ఉన్న పరిచయాలు కూడా తనకు మునుముందు రాజకీయంగా ఉపయోగపడతాయని షర్మిల భావిస్తున్నారు. కాంగ్రెస్  అధిష్టానం కూడా  ప్రాంతీయ పార్టీలను  కలుపుకుని తిరిగి అన్ని రాష్ట్రాలలోనూ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో విజయం ఆ పార్టీకి మంచి ఊపును తెచ్చి పెట్టింది. అదే ఊపుతో తెలంగాణలోనూ అధికారంలోకి  రావాలనుకుంటోంది. దీని కోసం పక్కా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో  వైఎస్ఆర్ టీపీని కలుపుకుని ముందుకు వెళ్లాలన్న  భావనతో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నట్లుగా  తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ, తనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి ఫోన్ వచ్చిందని వెల్లడించారు. ఈ క్రమంలో  ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతోందన్న ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.

విలీనం చేసుకోవాలని
అయితే, పొత్తులు కాకుండా షర్మిల పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఇలా చేయడం వలన తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా రాజకీయంగా పార్టీకి మరింతగా  ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ప్రధానంగా షర్మిలకు ఏపీలో నాయకత్వం ఆఫర్ చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్ఆర్  టీపీ ప్రభావం ఆశించిన  స్థాయిలో లేదని,  అదే ఏపీలో అయితే ఆమె ప్రభావం అధికంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయం ఆమెకు   వివరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం, సోదరుడు జగన్ తో ఎలాగూ సరి అయిన సంబంధాలు లేనందున ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు నచ్చచెబుతోందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే  రాజన్న కూతురుగా రెండు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావిత చేసే అవకాశం ఉంటుందని షర్మిలకు సూచిస్తున్నారని సమాచారం. 

కాదంటున్న వైఎస్ఆర్ టీపీ 
ఈ ప్రచారాలను మాత్రం వైఎస్ఆర్ టీపీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కేపీసీసీ చీఫ్ శివకుమార్ ను షర్మిల కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, మర్యాదపూర్వకంగానే కలిశారని  చెబుతున్నారు. ఇది కేవలం ఇరువురు నేతల మధ్య సుహృద్భావ సమావేశం మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి షర్మిలకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆమె బెంగుళూరులో శివకుమార్‌ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలతో షర్మిల జరుపుతున్న వరుస భేటీలు మాత్రం రాజకీయ వర్గాలలో రకరకాల  ప్రచారానికి దారి తీస్తున్నాయి. రాజకీయవర్గాలలో  వినిపిస్తున్న విధంగా షర్మిల  కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతారా? లేక  కాంగ్రెస్ అధిష్టాం కోరుకుంటున్న విధంగానే ఆ పార్టీలో  విలీనం చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.