ఉద్యోగులకు ‘జూమ్​’ బై బై..!

ఉద్యోగులకు ‘జూమ్​’ బై బై..!
zoom layoffs updates
  • భారీగా భారీగా రిట్రించ్​మెంట్​కు  సిద్ధం..
  • ఆర్థిక మాంద్యమేనంటున్న సీఈవో యువాన్​

న్యూఢిల్లీ: తాజాగా జూమ్​కంపెనీ తమ ఉద్యోగుల తొలగింపునకు నడుం బిగించింది. ఆర్థిక మాంద్యం కారణం బూచీగా చూపుతూ 1300 మంది ఉద్యోగాలపై వేటు వేయాలని గత ఏడాదే నిర్ణయించగా దాన్ని వ్యతిరేకత రాకుండా లోలోపల ఉద్యోగుల తొలగింపు చేపడుతోంది.  కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫారం జూమ్ వీడియో కమ్యూనికేషన్స్.. ఆర్థిక మాంద్యం ప్రభావంతో దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 15 శాతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో ఉద్యోగం ఎప్పుడు ఊడుతోందన్న టెన్షన్ ఉద్యోగుల్లో నెలకొంది. ఉద్యోగుల తొలగింపుపై జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ తన బ్లాగ్ పోస్ట్ లో స్పందించారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. ఈ ప్రభావం కస్టమర్‌లపై పడకుండా ఉండాలంటే మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి. దీంతో కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని కష్టమైన నిర్ణయం తీసుకున్నాం. దాదాపు 15 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నాం. కంపెనీ ఎదుగుదలకు ఉద్యోగుల కృషి, అంకితభావానికి కృతజ్ఞతలు.’’ అని చావు కబురును ఉద్యోగులకు ఎరిక్ యువాన్ చల్లగా వెల్లడించాడు. 

జూమ్ సీఈవో యువాన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. తన జీతంలో 98 శాతం తగ్గించుకున్నారు. అంతేకాకుండా ఎటువంటి బోనస్ కూడా తీసుకోవడం లేదని ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లోని మిగిలిన సభ్యులు కూడా కార్పొరేట్ బోనస్ తీసుకోరని, వారి బేస్ వేతనం 20 శాతం వరకు తగ్గిస్తామని యువాన్ వెల్లడించారు. కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ అయిన జూమ్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని రంగాల్లో ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ విధానం ద్వారా పనిచేశారు. దీంతో ఉద్యోగులతో ఇంటరాక్ట్ కావడానికి చాలా కంపెనీలు జూమ్‌‌పై ఆధారపడ్డాయి. కంపెనీలతో పాటు, స్కూల్స్, వ్యక్తిగత కమ్యూనికేషన్స్ కోసం ఎక్కువ మంది జూమ్‌పై ఆధారపడ్డారు.

దీంతో 2020లో జూమ్ వార్షిక ఆదాయం అమాంతం పెరిగింది. కంపెనీ భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. మొదట్లో వందల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,800కు చేరుకుంది. అయితే కరోనా అదుపులోకి రావడం, కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలకడంతో జూమ్ డిమాండ్ మందగించింది. ఆదాయ మార్గాలు సన్నగిల్లాయి. అదీ గాక జూమ్​ మీటింగ్​లో కొన్ని సంచలనాలు కూడా చోటు చేసుకోవడంతో కంపెనీ గౌరవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది.