Take a fresh look at your lifestyle.

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన బంగారు ఆభరణాల సమర్పణ..

చంద్రబాబు సమక్షంలో టీటీడీకి ఆభరణాల అందజేత.. బంగారంతో పాటు విలువైన వజ్రాలు కూడా విరాళంలో భాగం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, ఆయన సతీమణి రాధికా జైన్ దంపతులు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఈ విరాళంలో ఉన్నాయని తెలిపారు. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జైన్ దంపతులు ఆభరణాలను టీటీడీ అర్చకులు, ప్రతినిధులకు అందజేశారు.

అనంతరం జైన్ దంపతులతో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి ఇంత భారీ మొత్తంలో విరాళం అందించిన దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలతో దేవుని ఆదేశం మేరకు ఈ ఆభరణాలను సమర్పించినట్లు జైన్ దంపతులు చెప్పారని వెల్లడించారు. ఇంతటి అపూర్వ ఘట్టంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లభించని దివ్యానుభూతి తిరుమల క్షేత్రంలోనే దొరుకుతుందని, శ్రీవారి వైభవాన్ని మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు. ప్రతిరోజూ స్వామివారికి సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరణ చేస్తారని తెలిపారు. జైన్ దంపతులు సమర్పించిన 121 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాల విరాళం తిరుమల చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు.

శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు నేటివి కావని, శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని చంద్రబాబు గుర్తుచేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నేటి వరకు ఏడుకొండలవాడిపై భక్తి మరింత పెరుగుతూనే ఉందన్నారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూరు, మరాఠా పాలకులు తిరుమల ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చెప్పారు. స్వామివారికి అనేక ఆభరణాలు, కానుకలు, ఆస్తులను సమర్పించారని వివరించారు.

విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారని చంద్రబాబు తెలిపారు. ఆయన అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. పూర్వకాలంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో ఎవరూ అలాంటి సాహసానికి ఒడిగట్టలేదని వ్యాఖ్యానించారు.

శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు అనేక మంది నిరంతరం కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొక్కులు తీర్చుకునే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి కానుకలు, నిలువుదోపిడీలు సమర్పిస్తారని చెప్పారు. అలనాటి శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి జైన్ దంపతుల వరకు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించిన జైన్ దంపతుల భక్తిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.