Take a fresh look at your lifestyle.

పర్యాటకం, సంస్కృతి లింక్ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంతి ఉత్సవాలు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ​కళలే చైతన్యానికి ఆయువుపట్టని అన్న ఆయన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి సమస్యకు కళారూపాల ద్వారానే పరిష్కారాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చిన చరిత్ర మనదని గుర్తుచేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజలను జాగృతం చేసేందుకు కళలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, రాష్ట్రంలోని పురాతన ఆలయాలను కలుపుతూ.. పర్యాటకం, సంస్కృతి మేళవించిన ఒక ప్రత్యేక ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని సంగీత నాటక అకాడమీని ఆయన ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో రామదాసు జయంతి ఉత్సవాల్లో భట్టి ప్రసంగించారు. తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడు, భద్రాచల రామదాసు అని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని కళాకారులకు, సాంస్కృతిక వైభవానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను రాష్ట్ర అభివృద్ధి గురించి సంగీత నాటక అకాడమీ ఆధ్యర్యంలో అనేక కార్యక్రమాలతో ప్రజలకు వివరించారు, ఆ కళారూపాల్లో ప్రజలు పాల్గొనడమే కాదు ప్రజలు స్పందించిన తీరు తనకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిగా భవిష్యత్తులో సంగీత నాటక అకాడమీ విరివిగా కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుంటుందన్నారు. అవసరమైన ఆర్థిక అవసరాలను తీరుస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. నేలకొండపల్లిలో జన్మించిన గోపన్న తన భక్తితో, కీర్తనలతో భక్త రామదాసుగా చిరస్థాయిగా నిలిచిపోయారని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన కట్టిన భద్రాచలం ఆలయం, రాసిన కీర్తనలు ప్రతి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంత వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కళల పట్ల ప్రజలకు ఉన్న మక్కువ చూస్తుంటే సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.