ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామా సభలు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్దం చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నందు అదనపు కలెక్టర్ఉమా శంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరిలతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2 నుండి వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. గ్రామ సభ మండల, నియోజకవర్గ పరిదిలో సభలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాలికలు సిద్దం చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయం, సన్న బియ్యం బోనస్, రైతు భరోసా, రైతు భీమా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఎంత మంది లబ్ది దారులకు అందజేశారు. ఇంకా ఎంత మందికి ఇవ్వ వలసి ఉంది, ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు మరియు చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసిన వాటి పూర్తి సమాచారంతో లిస్టు సబ్మిట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ వాసు చంద్ర, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, సిపి ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.