Take a fresh look at your lifestyle.

మహాత్ముడికి అవమానం విగ్రహానికి పేడకొట్టి, చెప్పు పెట్టిన దుండగులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలో జాతిపితకు అవమానం జరిగింది. రాందాస్ చౌరస్తాలో గల మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విగ్రహానికి పశువుల పేడకొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి తలపై చెప్పు పెట్టారు. బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గమనించిన స్థానికులు మంగళవారం రాత్రి దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మహాత్ముడిని అవమానించిన దుండగులను శిక్షించాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ఆర్యవైశ్య సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.


అఖిలపక్ష నాయకులు నల్ల కండువాలు వెసుకుని రాందాస్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి పూల మాలలు వేశారు. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ మహేష్ చేరుకుని పరిశీలించారు. రాందాస్ చౌరస్తాలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. నాయకులు భూపతి రాజు, రాగి అశోక్, మ్యాడం బాలకృష్ణ, లక్ష్మీనారాయణ గౌడ్, పార్తివ్రనాథ్, పురం వెంకటనారాయణ, లక్ష్మీనారాయణ, మధు,, సాయి పంతులు, నాయిని ప్రసాద్,మేడిశెట్టి శంకర్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు.

దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు

మెదక్ పట్టణంలోని చౌరస్తాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడికి జరిగిన ఈ అవమానం దేశానికే అవమానమని ఆయన పేర్కొన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.