Take a fresh look at your lifestyle.

ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయండి : డీఈఓ రమేష్ కుమార్

 

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ సూచించారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 4 మంది రూట్ ఆఫీసర్లు, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 20 మంది కస్టోడియన్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 120 సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, 519 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు.

పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ప్యాడ్, పెన్నులు తమ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా కూడా హాల్ టికెట్ పొందవచ్చని చెప్పారు.

పరీక్ష కేంద్రాలను సులభంగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తీసుకురాకూడదని హెచ్చరించారు.

జిల్లాలో 6 ప్రభుత్వ, 122 జిల్లా పరిషత్తు, 20 కేజీబీవీలు, 1 ఎయిడెడ్, 2 తెలంగాణ మోడల్ స్కూల్స్, 7 టీజీ రెసిడెన్షియల్, 4 ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్, 2 సోషల్ వెల్ఫేర్, 7 ట్రైబల్, 8 మైనార్టీ రెసిడెన్షియల్, 2 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, 66 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

మొత్తం 265 పాఠశాలలకు చెందిన 10,658 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 5,294 మంది బాలురు, 5,364 మంది బాలికలు ఉన్నారని డీఈఓ తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ డీఈఓ రమేష్ కుమార్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.