* ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోకి మంత్రి పొంగులేటి గ్రూప్ ఎంట్రీ
ముద్ర ప్రతినిధి, ఖమ్మం, సెప్టెంబరు 3 : వ్యాపార రంగంలో అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ‘రాఘవ’ బ్రాండ్‌ను ఓ ప్రభంజనంలా మార్చిన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మౌలిక వసతుల కల్పన, కాంట్రాక్టింగ్ రంగంలో పటిష్టమైన పునాది వేసి, నీటిపారుదల, రహదారుల నిర్మాణాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. వ్యాపారంలో తిరుగులేని విజయం సాధించిన అనంతరం ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రజాదరణ పొందిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తన మార్కు చూపిస్తున్నారు.

ఇప్పటివరకు మట్టి, కాంక్రీటు, నిర్మాణ రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించిన రాఘవ గ్రూప్, ఇప్పుడు అంతరిక్షం, రక్షణ రంగాల వైపు తన దృష్టిని మళ్లించింది. సరికొత్త సాంకేతికతకు నిలయమైన హైదరాబాద్ కేంద్రంగా ‘రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో డిఫెన్స్ రంగంలోకి అడుగుపెడుతూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో కొలువుదీరిన ఈ కార్పొరేట్ సంస్థను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
నిన్నటివరకు కాంట్రాక్టింగ్, ఇన్‌ఫ్రా రంగాల్లో దేశీయంగా రాణించిన ఈ గ్రూప్, ఇప్పుడు దేశ రక్షణ రంగం (Make in India) బలోపేతానికి తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అధునాతన డ్రోన్ టెక్నాలజీ, మిస్సైల్ విడిభాగాలు, ఏరోస్పేస్ పరికరాల తయారీయే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. పొంగులేటి లిఖిత్ రెడ్డి నేతృత్వంలో రాబోతున్న ఈ ‘రాకెట్ రాఘవ’, రాబోయే రోజుల్లో రక్షణ ఉత్పత్తుల తయారీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.