Take a fresh look at your lifestyle.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు గా ముందుకు.. : మంత్రి అడ్లూరి

జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి..
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
కరీంనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి..
జాతీయ పతాక ఆవిష్కరణ.. స్వాతంత్ర్య సమర యోధులకు సన్మానం..
ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంస పత్రాల అందజేసిన మంత్రి అడ్లూరి..
ముద్ర, కరీంనగర్: 
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని  పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అడ్లూరి స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లాలో  వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రసంశ పత్రాలను అందజేశారు.
ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థిని, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భారత స్వాతంత్య్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందామని  స్వాతంత్ర్య సాధనకు పోరాడిన త్యాగధనుల అందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నమని మంత్రి తెలిపారు.
ప్రజా పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించే అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.
మహాలక్ష్మి పథకంలో 9 డిసెంబర్‌ 2023న ప్రారంభించిన పథకం మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 8 కోట్ల3 లక్షల ప్రయాణాలు చేసి తద్వారా రూ. 366 కోట్ల 31 లక్షల రూపాయల లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 58 వేల లబ్దిదారులకు 9 లక్షల 23 వేల 755 గ్యాస్‌ సిలిండర్లను రూ. 500లకు సరఫరా చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఇందుకు గాను  29 కోట్ల 78 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు.
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తోందని జిల్లాలో ఒక లక్షా 71 వేల 622 సర్వీసులకు గాను ఇప్పటివరకు రూ. 182 కోట్ల 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వివరించారు.
‘‘రైతుభరోసా’’ పథకం ద్వారా ఈ వానాకాలం పంటకు గాను ఒక లక్షా 92 వేల 628 మంది రైతులకు రూ . 206 కోట్ల 82 లక్షల లను జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సన్నరకం ధాన్యం విక్రయించిన 28 వేల 659 మంది రైతులకు 71 కోట్ల 17 లక్షల రూపాయల బోనస్ జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
జిల్లాలో మొదటి విడతలో 10 వేల 506 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికే 8 వేల 557 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.అంతేకాకుండా ఇంటి పైకప్పు మార్చుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  ఇందుకోసం ప్రతి గృహానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా 8 వేల 584 ఇందిరమ్మ ఇండ్లకు మరుగుదొడ్లు మంజూరయ్యాయని
జిల్లాలో ఒక లక్ష 32 వేల 229 మంది లబ్దిదారులకు ప్రతి నెలా  30 కోట్ల 60 లక్షల రూపాయల చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన మరింత మందికి కొత్త పింఛన్లు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఈ నేపథ్యంలో జిల్లాలో అర్హులందరికీ కొత్త పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 47 వేల 138 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయడం జరిగింది. 97 వేల 13 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 22 వేల 198 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6 వేల 63 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియను ప్రారంభించడం సంతోషకరమైన విషయమని రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో జనవరి నుండి ఇప్పటి వరకు 14  వేల 932 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందని మంత్రి తెలిపారు. 42 కోట్ల 75 లక్షల రూపాయలను ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
‘‘ఇందిరా మహిళా శక్తి’’ పథకం కింద 93యూనిట్లకు గానూ 2 కోట్ల 65 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 175 స్వయం సహాయక సంఘాలకు 26 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఒక వెయ్యి 706 మహిళా సంఘాలకు 165 కోట్ల 74 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు.
ఒక లక్ష 46వేల 610 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని ఈ ఆర్థిక సంవత్సరంలో 374 మహిళా సంఘాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశామని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ లో, గంగాధరలో పెట్రోల్ పంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 4 వేల 290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించినట్లు మంత్రి వివరించారు. 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామసభలు నిర్వహించి 2 వేల 986 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
జిల్లాలోని అన్ని గ్రామాలలో 15 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. చొప్పదండి మండలం కోనేరుపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని మంత్రి తెలిపారు. సర్పంచుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు.
 ప్రజలకు దూర భారాన్ని తగ్గించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర  ప్రభుత్వం జూన్ నుండి డివిజన్ ప్రజావాణి ప్రారంభించింది. ఈ నెల 17 నుండి మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా భూవివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమగ్ర భూసర్వే కు శ్రీకారం చుట్టామని మొదటి దశలో జిల్లాలో 70 గ్రామాలు గుర్తించి 7 గ్రామాల్లో భూముల రీసర్వే చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సరిహద్దులను పకడ్బందీగా నిర్ణయిస్తున్నామని రైతు ప్రయోజనాల కోసం భూదార్ నెంబర్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల అనుబంధ పనులకు సంబంధించి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది.
ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతులకు దీర్ఘకాలం ఆదాయం వచ్చే ఆయిల్ ఫాం పంటలు ప్రోత్సహించి సబ్సిడీ అందిస్తున్నామని ఆయన చెప్పారు.రైతు ప్రయోజనాల దృష్ట్యా పరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అడ్లూరి అన్నారు.
ఇందులో భాగంగా గత ఏడాది జిల్లాలో 6 వేల 130 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ వానాకాలంలో ఇప్పటివరకు 19 వేల 135 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం జరిగిందని ఈ వానాకాలం పంట కోసం 39 వేల 277 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 22 వేల 714 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 2 కోట్ల 20 లక్షల చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు ప్రక్రియ ప్రారంభించామని మంత్రి అడ్లూరి అన్నారు. తద్వారా జిల్లాలో 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
గత యాసంగి సీజన్‌లో 319 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 38 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఒక లక్ష 42 వేల 346 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు.
విబి-జి రామ్ జీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 51 వేల 517 కుటుంబాలకు 17 లక్షల పని దినాలు కల్పించమని 41 కోట్ల 20 లక్షల రూపాయల వేతనాన్ని ప్రభుత్వం అందజేసిందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చొప్పదండిలో 37 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ వైద్యశాల నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని మానకొండూరులో 17.5 కోట్ల రూపాయలతో 30 పడకల సామాజిక వైద్యశాల భవనం నిర్మాణ దశలో ఉందని 15 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో ఆయుష్ ఆసుపత్రి నూతన భవనం నిర్మించనున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కొత్తపల్లి మెడికల్ కళాశాల ఆవరణలో రూ.26 కోట్లతో మూడెకరాల్లో నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం పూర్తి కావస్తున్నదని జిల్లా యంత్రాంగం సమన్వయంతో 2 కోట్ల 98 లక్షల సీ.ఎస్.ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్, వివిధ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.
విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్  నిర్మాణాలను ప్రారంభించామని విదేశాల్లో విద్యా విధానం, బోధన పద్ధతులు అధ్యయనం చేసేందుకు జిల్లా నుండి ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించే   “హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్” కు జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు స్థలం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 5 వేల 351 మంది మహిళలను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాని ఈ శిక్షణలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం విశేషమని మంత్రి తెలిపారు.
                                                                                                                               జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుండి 83 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధన ప్రారంభించాం. ఇందుకు అవసరమైన సిబ్బందిని భర్తీ చేశామని ఈ పాఠశాలలకు ప్రీస్కూల్ కిట్లు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 16 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.
షెడ్యూల్డ్‌ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం. వీరికి ఉపకార వేతనాలు అందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాం. మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, హాస్టల్లో 3 వేల 822 మంది విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 2 వేల 214 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో వసతి కల్పిస్తున్నామని గత విద్యా సంవత్సరం వసతి గృహాల్లో చదివిన పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని మంత్రి వివరించారు. ఎస్సీ, స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 238 మంది ఉద్యోగాలు సాధించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 17 వేల 996 మంది విద్యార్థులకు 22 కోట్ల 82 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందజేశామని మంత్రి వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం అమలుకు 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు.
అదేవిధంగా జిల్లాలోని ఒక వేయి 518 సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కేజీవీబీలు, మోడల్‌ స్కూల్స్‌, అంగన్‌ వాడి కేంద్రాలకు 395 టన్నుల ఫోర్టిఫైడ్‌ సన్న బియ్యాన్ని ప్రతి నెలా సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా 7 వేల 579 మంది గర్భిణీలు, బాలింతలకు, 42 వేల 909 మంది 7 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు బలవర్ధక, పోషక ఆహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని గత నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 151 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు మంత్రి తెలిపారు‌.
వయో వృద్ధులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని దివ్యాంగులకు ఈ ఏడాది 132 సహాయ ఉపకరణాలు పంపిణి చేశామని దివ్యాంగులను వివాహం చేసుకున్న 17 జంటలకు ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల యు.సి.ఎఫ్ నిధులు, 50 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎఫ్ నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టడడం జరిగిందని మంత్రి తెలిపారు. 158 కోట్ల  మున్సిపల్ సాధారణ నిధులతో నగరంలో సి.సి రోడ్లు, డ్రైన్, మంచినీటి పైప్ లైన్ వంటి పనులు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణలో జనగణన భాగంగా మొదటి దశలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా సేకరణ ప్రక్రియ పూర్తయిందని వచ్చే ఫిబ్రవరిలో జనగణన చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వంద శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని ఓటర్లు తిరిగి సమర్పించిన 83.74 శాతం ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్‌ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్‌ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.