ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఖురేషి కులస్తులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్, హిందూ వాహిని, శ్రీరామ్ సేన, హిందూ యువవాహిని సభ్యులతో వేర్వేరుగా అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ… సరైన అధికారిక అనుమతులు, పత్రాలు ఉన్న పశువులను మాత్రమే సంహరించాలని ఖురేషి కులస్తులకు సూచించారు. ఆవులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించవద్దని తెలిపారు. పశువుల కొనుగోలు సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. మాంసం నిల్వ చేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని, పక్షులు, కుక్కలు, కోతుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తులపై దాడులకు పాల్పడడం నేరమని హెచ్చరించారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామని చెప్పారు. పశువుల అక్రమ రవాణా శిక్షార్హమైన నేరమని, మూగజీవాలపై క్రూరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.
ఈ సమావేశంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్, సీఐ లు జార్జ్, సందీప్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మత పెద్దలు పాల్గొన్నారు.
ఇద్దరు జూదరుల అరెస్ట్
పాపన్నపేట మండలం అన్నారం గ్రామ శివారులోని ప్రకృతి వనం వెనుక పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టైన వారిలో దర్శనం రాజు, దర్శనం వినోద్‌కుమార్ లున్నారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post