- నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయం: చీఫ్ జస్టిస్ చెల్లా కోదండరామ్
- సమాజానికి తమ వంతు సేవ చేయడం అందరి బాధ్యత: గట్టమనేని బాబురావు
- కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
- ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు చిన్నారులు
కూకట్ పల్లి, ముద్ర: సమాజంలోని నిరుపేద విద్యార్థులకు విద్యను, వృద్ధులకు వైద్యం, ఆహారం, వసతి కల్పించడమే లక్ష్యంగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ కృషి చేయడం అభినందనీయమని చీఫ్ జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు. ఆదివారం కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లి లోని కాసాని కౌసల్య ఫామ్స్ లో నిర్వహించిన కమ్మవారి సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య , వైద్యం నిరుపేదలకు అందరి ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కమ్యూనిటీలు, స్వచ్ఛంద సంస్థలు నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అభినందించారు. మరో అతిథి ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ కమ్యూనిటీలు చేస్తున్న కార్యక్రమాలు అందరిని ఒకే వేదిక మీదికి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మరో అతిధి బాలలత మాట్లాడుతూ ఇక్కడ జరిగే సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ఉందన్నారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యను, వృద్ధులకు వైద్యం, ఆహారం, వసతి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే 12 హాస్టల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాస్టల్స్ లో నివాసం ఉంటూ 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదివవే విద్యార్థులే 1500 మంది ఉన్నారన్నారు. నిరుపేద వృద్ధులకు వైద్యంతోపాటు ఆహారం వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలు మహిళలు , చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ కార్యదర్శి, విజేత సూపర్ మార్కెట్స్ అధినేత జగన్ మోహన్ రావు, కోశాధికారి బ్రహ్మాజీ, అప్ప స్వామి, రాజేష్, అడుసుమల్లి శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కమ్మ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.