- మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహాత్మ జ్యోతిబాపూలే సంఘసంస్కర్త ఆశా సిద్ధి కోసం పాటుపడాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.జగిత్యాల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు స్థానిక జ్యోతిబా పూలే పార్క్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే విద్య ప్రాధాన్యతను గుర్తించి, విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని విశ్వసించారని,విద్య కేవలం పురుషులకే పరిమితం కాకుండా మహిళలు కూడా విద్యను అభ్యసించాలని,తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిని చేసి బాలికల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు ప్రారంభించేలా ప్రోత్సహించారన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనగారిన వర్గాల కోసం కృషి చేశారని అదే దారిలో బలహీన వర్గాల కోసం వారి హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం జ్యోతిబాపూలే కృషి చేశారని కొనియాడారు.సమాజంలోని బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బలహీనవర్గాలు నేడు కొంతమేరకే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నరని జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ, సాంకేతిక గుర్తింపు లేకుండా పోయిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన చేపట్టేందుకు ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ సైతం వేసిందని ఆ మేరకు 56% బలహీన వర్గాల జనాభా ఉన్నట్లు లెక్క తేల్చింది.బలహీన వర్గాలకు కనీసం 42 శాతం రిజర్వేషన్లు అందించాలని శాసనసభ, శాసన మండలిలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ రిజర్వడ్ కులాల ఆర్థిక వెనుకబాటును పరిగణలోకి తీసుకుంటూ రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భేషజాలకు పోకుండా బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా రాజ్యాంగాన్ని సవరించి తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచాలని కోరారు.బలహీన వర్గాల హక్కులు కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా భావించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బలహీన వర్గాల హక్కుల సాధన తో పాటు ఆనాటి సమాజంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తూనే, మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు ప్రజలను చైతన్యపరిచిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబాపూలేకు భారతరత్న అవార్డు ప్రకటించి, ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జ్యోతిభా పూలే ఉత్సవ కమిటీ కన్వీనర్లు మానాల కిషన్, హరి అశోక్ కుమార్, మాజీ కౌన్సిలర్స్ పులి రాము మాజీ యువజన నాయకులు గుండ మధు బోగోజీ. ముకేశ్ ఖన్నా, తోపారపు రజనీకాంత్, బొల్లి శేఖర్, అభి బ్రహ్మాండబెరి. నరేష్, ముసిపట్ల. లక్ష్మి నారాయణ, కొక్కు. గంగాధర్, గంగం. జలజ, కస్తూరి. శ్రీ మంజరి తదితరులు పాల్గొన్నారు.