Take a fresh look at your lifestyle.

చిత్రపురి కాలనీలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం

– మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం..
– సినీ కార్మికుల సేవా స్ఫూర్తికి నిదర్శనం
-వల్లభనేని అనిల్‌కుమార్, పీఎస్‌ఎన్ దొర ఆధ్వర్యంలో నిర్వహణ

ముద్ర, హైదరాబాద్ : సినీ కార్మికుల పక్షపాతి, మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్రపురి కాలనీ ఎల్‌ఐజీ ప్రాంతంలో వల్లభనేని అనిల్‌కుమార్, పీఎస్‌ఎన్ దొర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, కళాకారులు, కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా సామాజిక సేవాకార్యక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, అందుకే చిరంజీవి జన్మదిన వేడుకలకు సేవా కార్యక్రమాన్ని జోడించినట్లు పేర్కొన్నారు. సినీ కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు, చిత్రపురి కాలనీ మాజీ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. చిత్రపరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల పట్ల ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన అభిమానాన్ని, ఆప్యాయతను చూపించారని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పీఎస్‌ఎన్ దొర ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
చిత్రపురి కాలనీ, ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ సెక్రటరీ పీఎస్‌ఎన్ దొర మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి సినీ రంగానికి చెందిన వారు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో స్పందించడం అభినందనీయ మన్నారు.
సినీ ప్రముఖుల సందడిఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు హీరో శ్రీకాంత్‌తో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై రక్తదాతలను అభినందించారు. అలాగే చిరంజీవి కుటుంబానికి చెందిన సుస్మిత, నిహారిక తదితరు లు కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమానికి తమ మద్ద తు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
సేవా కార్యక్రమాలకు చిత్రపురి కాలనీ వేదిక
సినీ పరిశ్రమకు చెందిన వేలాది మంది కార్మికులు, కళాకారులకు చిత్రపురి కాలనీ ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా ఉంది. ఇక్కడ సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సినీ కార్మికుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.
సినీ కార్మికుల సంక్షేమం, సమాజ సేవ, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని వల్లభనేని అనిల్‌కుమార్, పీఎస్‌ఎన్ దొర తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.