Take a fresh look at your lifestyle.

పొంగులేటి… నీ పొగరు తగ్గించుకో అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం మాజీ మంత్రి హరీశ్​రావు

ముద్ర, వనపర్తి:
‘పొంగులేటి నీ పొగరు తగ్గించుకో…. లేకపోతే నీ అవినీతి చిట్టాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా విప్పుతాం. నీ అవినీతి అక్రమాల విషయాలు బయటకు రావాల్సిందే’నంటూ మాజీ మంత్రి హరీశ్​రావు రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు. గురువారం వనపర్తి జిల్లా గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు చేస్తున్న దీక్షలు నూరు రోజులు పూర్తయిన సందర్బంగా వారికి సంఘీభావంగా ఏదుల వద్ద నిర్వహించే బహిరంగ సభకు వచ్చిన ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంతే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో అవినీతిని తమ అధికారులే గుర్తుపట్టారని చెప్పారని, ఆ మైనింగ్ నీది కాకపోతే అక్కడ కంటెయినర్ మీద రాఘవ కన్ర్ట్సక్షన్స్​ పేరు, కంటెయినర్​ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకున్నాయో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

అసెంబ్లీలోనే ఉన్న మంత్రి తనకు మైనింగ్​ లేదని ఎందుకు చెప్పలేదని అన్నారు. ఆయన మాట్లాడే తీరు మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా మాట్లాడినట్టుందని పేర్కొన్నారు. తానొక్కడినే అవినీతిపరుణ్ని కాదు తమ క్యాబినెట్లోని కొందరూ అవినీతిపరులని ఆపాదించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

జూ పల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్లు, డెప్యూటీ సీఎం మల్లుబట్టి పర్సంటేజీలు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలలో మంత్రుల కుంభకోణాలు కూడా ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆయన ప్రయత్నం తాపత్రయం అంతా కూడా నేనొక్కడినే అవినీతి పరున్ని కాదు రాష్ట్ర క్యాబినెట్లో చాలా మంది ఉన్నారని చెప్పేలా ఉందని పొంగులేటి చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. ఆయన పొంగులేటి కాదు పొంగులూటీ అంటూ అభివర్ణించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ లో జరిగిన అవినీతి అక్రమాలను తమ అధికారులే బయటికి తీశారని, జరిమానా వేశారని సీఎం పేర్కొన్నారన్నారు.

రెవెన్యూ, పొల్యూషన్​, మైనింగ్​, విద్యుత్​ శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీసు లిచ్చారని, నాలుగు శాఖల అధికారులు చెప్పింది తప్పా, పొంగులేటి చెప్పింది తప్పా, మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా చెప్పాలని డిమాండు చేశారు. నాదర్​గుల్ భూముల విషయంలో బీ ఆర్ఎస్ 2016లో ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని, ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఆర్డిఓ ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. 2022లో కంపెనీలు హైకోర్టుకు పోతే ప్రభుత్వం తన వాదన వినిపించి ఆర్డీవో నిర్ణయం సరైనదే నని చెప్పారన్నారు. శిల్ప, కోహినూర్ , ఏ క్యు స్క్వేర్ కంపెనీ నీ కొడుకు పేరున లేదా, శిల్ప సంస్థతో వ్యాపార సంబంధాలు లేవా అంటూ ప్రశ్నించారు. నాదర్​గుల్​ భూమి ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో వేశా మంటున్నప్పుడు నీతి, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదంటూ దుయ్యబట్టారు. రెండున్నర ఏళ్లు గా ఏం చేస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉంటే హైడ్రో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, మాజీ ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వర్​రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.