Take a fresh look at your lifestyle.

వడగాలుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వెంట తాగునీటి బాటిల్ తీసుకెళ్లాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర: వనపర్తి:
జిల్లాలో రానున్న వారం రోజుల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అన్ని జిల్లా శాఖల అధికారులతో ఎండాకాలం వడగాలులపై సమావేశం నిర్వహించి, అధికారులకు తగు సూచనలు చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న వారం రోజుల్లో భారీగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వడగాలుల విషయంపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలకు ఎండల వేడిమి నుంచి ఉపశమనం కల్పించే విధంగా అక్కడక్కడ తాగునీటి కోసం చలివేంద్రాలని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు కూడా బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ వెంట తాగునీటి కోసం బాటిల్ వెంటబెట్టుకొని వెళ్లాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కూలీలకు పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు సహా చలువ నీడ కోసం టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో నీరు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రైతులు కూడా మధ్యాహ్నం ఎండవేళల్లో వ్యవసాయ పనులకు వెళ్ళవద్దని సూచించారు. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రజలందరికీ ఎండాకాలంలో సరైన సమయానికి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎండ వేడిమి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరణ చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పి సీఈవో యాదయ్య, డిఎస్పీ బాలాజీ నాయక్, డిటిఓ మానస, డి ఆర్ డి ఓ ఉమాదేవి, సిపిఓ హరికృష్ణ, ఇతర జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.