పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన కేంద్రం.-సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో వాణిజ్య భవన్ సెంటర్లో ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పెరిగింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచబోమని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల నమ్మిస్తూ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను పెంచుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నామని మాట్లాడుతున్న బిజెపి ప్రభుత్వం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఎందుకు ఇక్కడ ధరలు తగ్గించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని అన్నారు. గడిచిన 12 ఏళ్లుగా ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించని ఎడల ప్రజా ఆగ్రహాన్ని గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు రేగటి లింగయ్య, పట్టణ కార్యవర్గ సభ్యులు చామల అశోక్ కుమార్, దీకొండ శ్రీనివాస్, పట్టణ మైనార్టీ నాయకులు ఎండి పాషా, ఏఐవైఎఫ్ గౌరవ పట్టణ అధ్యక్షులు కుక్కడప్పు శౌరి, పట్టణ కార్యదర్శి ఎడెల్లి శ్రీకాంత్, పూన్నం రమేష్ , అయితే గాని కామేష్, గురు స్వామి, మహిళా సంఘం నియోజకవర్గ నాయకురాలు పొదిల వెంకటమ్మ, దంతాల పద్మ రేఖ, దేశ గాని హేమలత, సివిల్ సప్లై హమాలీ నాయకుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.