Take a fresh look at your lifestyle.

గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలంలో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.

 

గ్రామానికి చెందిన రైతు సింహాద్రి వెంకట్రామరెడ్డి తన పొలంలోని పాటిదిబ్బను దున్నుతున్న సమయంలో నాగలికి తగిలి ఈ విగ్రహాలు భూమి పైకి వచ్చినట్లు తెలిపారు. ఈ విగ్రహాలు ఎర్ర ఇసుకరాతి (చింతామణి రాయి)తో చెక్కబడ్డాయని చెప్పారు. వాటిలో ఒకటి సుమారు 3 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉండగా, మరోటి 5 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు వివరించారు.

విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, నలుపు-ఎరుపు, గచ్చకాయ, గోధుమ రంగులకు చెందిన మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయి. ఈ పెంకులు క్రీస్తుశకం ఒకటి నుంచి నాలుగో శతాబ్దం మధ్యకాలానికి చెందినవిగా పురావస్తు నిపుణులు గుర్తించినట్లు వెల్లడించారు.

ఈ గణేశ విగ్రహాల రూపకల్పన పల్నాడు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉందని డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపారు. ఈ పోలిక ఆధారంగా ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని చేజెర్లను అప్పట్లో కందరాపురంగా పిలిచేవారని, ఆనందగోత్రిక రాజుల పాలనలో క్రీస్తుశకం నాలుగో శతాబ్దానికి చెందినవిగా ఈ విగ్రహాలను భావిస్తున్నట్లు చెప్పారు.

చారిత్రక, పురావస్తు పరంగా అత్యంత విలువైన ఈ గణేశ విగ్రహాలు, ఇతర పురాతన అవశేషాలను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రైతు సింహాద్రి వెంకట్రామరెడ్డిని కోరారు.

 

 

Leave A Reply

Your email address will not be published.