Take a fresh look at your lifestyle.

ప్రజావాణిలో మొత్తం 50 దరఖాస్తులు స్వీకరణ

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 50 దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వీకరించిన అన్ని దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా, దరఖాస్తుల పరిష్కార స్థితిని దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి అందిన దరఖాస్తులన్నీ పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుండి కార్యాలయానికి వస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాధాన్యతతో స్పందించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.