Take a fresh look at your lifestyle.

లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఫిజికల్ ఫిట్నెస్ అత్యంత అవసరమని అన్నారు. చదువుతో పాటు శరీర దృఢత్వానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. దేశ భవిష్యత్తు కోసం యువత క్రమశిక్షణతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత 14 ఏళ్లుగా విద్యార్థులకు అథ్లెటిక్స్‌లో శిక్షణ అందిస్తున్న కోచ్ మల్లేష్ సేవలు అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కోచ్‌లు చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకుని క్రీడలు, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా తగినంత తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చంద్రపాల్ రెడ్డి, కోచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.