ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
అధికారుల–ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి వేగవంతం : మంత్రి జూపల్లి కృష్ణారావు
జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా పాలనలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని సూచించారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి తేజ కన్వెన్షన్ హాల్‌లో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా పాలన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
తెలంగాణ జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలులో వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.
పాలమూరు ప్రాంత రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు.
గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వారధిగా పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు 5 వేల ఫైళ్లను వచ్చే 15 రోజుల్లో పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ్, సహాయం, నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.