Take a fresh look at your lifestyle.

స్వయం సహాయక సంఘాలతో ఆర్గానిక్ వ్యవసాయం, సౌర ప్యానెల్‌ల ద్వారా రైతుల సంక్షేమం-వ్యవసాయ శాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

 
వ్యవసాయ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు
కూరగాయలు, పూల ఉత్పత్తులకు మార్కెటింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో భాగస్వాములుగా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సాగు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్ ఖర్చులు మిగలడంతో పాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు పెద్ద సంఖ్యలో పంపిణీ చేస్తుందనీ , విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఈ అంశాన్ని రైతులకు చక్కగా వివరించాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరి సాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాల పై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.