ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నాగర్ కర్నూల్ వైద్య కళాశాల 2024 విద్యార్థుల ఆధ్వర్యంలో క్షయ (టిబి) వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్యాధికారి డాక్టర్ పి. సృజన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయడంతో పాటు వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రహదారి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం టిబి ముక్త్ భారత్ కార్యక్రమం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ నరేష్, మెడికో సోషల్ వర్కర్ డి. బాలమ్మ, హెల్త్ సూపర్వైజర్లు అశోక్ కుమార్, చంద్రశేఖర్, క్షయ వ్యాధి సూపర్వైజర్ శ్రీనివాసులు, ఆరిఫ్, శ్రావణ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కే. మంగ, శ్వేత, ఆశా కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.