
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10.10 గంటలకు రాజస్థాన్‌లోని మెమెంటోస్ ప్యాలెస్లో తెలుగు హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయాన్ని గౌరవిస్తూ కొడవ ఆచారంలో మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారు.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన కొడవ సమాజంలో పెళ్లిని ‘మంగళ’గా పిలుస్తారు. ఈ విధానంలో పురోహితులు, హోమాలు ఉండవు. పెద్దల సమక్షంలో ప్రకృతి సాక్షిగా వివాహం జరుగుతుంది. వరుడు నల్లటి ‘కుప్య’, నడుము పట్టీ, చిన్న కత్తి ధరించగా, వధువు ప్రత్యేక శైలిలో చీర కట్టుకుంటుంది.
వేదికకు వెళ్లే ముందు వరుడు అరటి చెట్టు కాండాన్ని నరుకడం పరాక్రమానికి సూచకం. పెళ్లి సమయంలో పెద్దల దీవెనలకే ప్రధాన్యం ఉంటుంది. వధువుకు నాణేల మూట అందించడం శుభసూచకంగా భావిస్తారు. అనంతరం అత్తింటిలో గంగా పూజ నిర్వహిస్తారు. కొడవ వివాహాల్లో మాంసాహారం, మద్యం విందు ప్రత్యేకతగా ఉంటాయి.