Take a fresh look at your lifestyle.

దావోస్​లో రైజింగ్​ ధూంధాం … గురువును మించిన శిష్యుడు

  • అటు హామీలు.. ఇటు ఒప్పందాలు
  • పెట్టుబడుల వేటలో రేవంత్​ టీం సక్సెస్​
  • 16 పెద్ద ప్రాజెక్టులతో.. రూ. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు
  • ఏపీకి మాటవ్వని కంపెనీలు
  • చర్చలతోనే సరి .. ఒప్పందాలపై వెనకడుగు
  • ఈసారి ముందంజలో మహారాష్ట్ర
  • 9.3 లక్షల కోట్ల పెట్టుబడులతో అగ్రస్థానం
  • దావోస్​ నుంచి వెనుదిరిగిన రాష్ట్రాల సీఎంలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : దావోస్ ​వేదికగా.. తెలంగాణ రైజింగ్​ టీం పెట్టుబడులపై దండయాత్ర చేసింది. చేసిందే చెప్పుకుని లక్షల కోట్లను రాష్ట్రం వైపు తీసుకువచ్చింది. తొలిసారి సీఎంగా సీఎం రేవంత్​రెడ్డి.. దావోస్​ ప్రపంచ ఆర్థిక సదస్సుపై అడుగు పెట్టారు. సీనియర్​ మంత్రి శ్రీధర్​ బాబును వెంటేసుకుని.. ప్రపంచ పరిశ్రమలను రాష్ట్రం వైపు నడిపించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారాన్ని వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. దావోస్​ పర్యటన ఇప్పుడు తెలంగాణకు కలిసి వచ్చింది. తెలంగాణ బ్రాండ్​ను మరోసారి ప్రపంచవేదికపై చూపించుకున్నది. ఇక, సీనియార్టీ సీఎంగా చెప్పుకున్న ఏపీకి ఈసారి పెట్టుబడులు రాలేదు. కేవలం చర్చలతోనే పర్యటన ముగించారు. ముందు నుంచీ ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ నెలకొనగా.. ఎట్టకేలకు తెలంగాణ రైజింగ్​టీం పైచేయిగా నిలిచింది.

రెండు రాష్ట్రాల నుంచి రెండు టీంలు

దావోస్ వేదికపై జరిగిన వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం సదస్సుకు సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని టీం వెళ్లింది. ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్​లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సదస్సులో ఇప్పటికే రూ.1.78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం.

ఏపీ నుంచి ..

ఆంధ్రప్రదేశ్ కు భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఒక టీమ్ దావోస్ వెళ్లింది. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, కేంద్రమంత్రి రామ్మోహన్​నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడుల కోసం దావోస్​కు వెళ్లారు. కానీ, ఏపీకి గర్వించే స్థాయిలో పెట్టుబడులేవీ రాలేదు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడినా.. అవన్నీ చర్చలకే పరిమితమయ్యాయి. ఏపీ విషయానికి వస్తే, ఇంకా పారిశ్రామికవేత్తలను ఏపీకి రావాలని ఆహ్వానించడానికే సమయం సరిపోతోంది. ఏపీలో అపార అవకాశాలున్నాయని, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్లుగా మాత్రమే ఉంది. పెట్టుబడులు పెట్టడానికి పెద్దపెద్ద కంపెనీలు ముందుకు రాలేదు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకోలేదు. గతంలో చంద్రబాబు దావోస్ వెళితే చాలు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయనే ఒక ప్రచారం. కానీ, పెట్టుబడుల సాధనలో సీఎం చంద్రబాబు తన శిష్యుడి కంటే వెనుకబడ్డారనే టాక్ వినిపిస్తోంది. దావోస్ పర్యటన తెలంగాణను బూస్టింగ్​ ఇస్తే.. ఏపీకి మాత్రం నిరుత్సాహం మిగిలించింది. ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూడకపోవడానికి వైఎస్ జగనే కారణమంటూ ఇప్పుడు టీడీపీ కొత్త రాగం ఎత్తుకుంటున్నది.

తెలంగాణ రైజింగ్.. రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు

దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగా.. ఈ కొత్త ఒప్పందాలతో 49,500 ఉద్యోగాలు రానున్నాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వెళ్లారు. మూడు రోజులు దావోస్ లో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులతో వీరు సమావేశాలు అయ్యారు. తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు వివరిస్తూ రాష్ట్రానికి రావాలని కోరుతున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో భారీ పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. అమెజాన్​ ఏకంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. తొలుతగా రాష్ట్రంలో పెట్టుబడిపెట్టేందుకు యూనిలీవర్​ముందుకు వచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్​ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఎంవోయూ చేసుకున్నది. ప్రఖ్యాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. కంట్రోల్ఎస్ తలపెట్టిన అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ సామర్థ్యం 400 మెగా వాట్లు కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అంగీకరించింది.

హైదరాబాద్ లొ రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది. అటు హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణకు ఒప్పందం చేసుకున్నది. కొత్తగా 17000 ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో ఒప్పందం కుదిరింది. విప్రో విస్తరణకు కూడా ఎంవోయూ చేసుకున్నారు. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు ద్వారా 5000 మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ద్వారా జేఎస్​ డబ్ల్యూ రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా రానున్నాయి. మూడు చోట్ల సన్ పెట్రో కెమికల్స్ పరిశ్రమలు నెలకొల్పనుండగా.. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఇక, రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు మెఘా ఇంజినీరింగ్​ కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకాలు చేసింది. దీని విలువ రూ. 15 వేల కోట్లు. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్‌ కంపెనీ ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎంవోయూ చేసుకున్నది. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్​ ఏఐ డేటా సెంటర్కు రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో పాటుగా బ్లాక్ స్టోన్ కంపెనీ కూడా 4,500 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి రానున్నది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్​లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. సోలార్ సెల్స్ తయారీ యూనిట్ రూ.7000 కోట్ల పెట్టుబడులకు మైత్రా ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 800 మంది ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

చర్చలు పెట్టి.. వెళ్లిపోయారు.. ఏపీకి కేవలం హామీలే

మరోవైపు ఏపీ తరపున దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ టీమ్ ఉమ్మడిగానూ, వేర్వేరుగానూ పలువురు పెట్టుబడిదారులతో భేటీ అయింది. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించినా.. పెట్టుబడిదారుల నుంచి మాత్రం రిప్లై రాలేదు. ఐటీ, ఏఐ, డేటా రంగాల్లో సంస్ధలు పెట్టేందుకు రాష్ట్రానికి రావాలని కోరినా.. స్పందించలేదు. ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్‌ కోసం డీపీ వరల్డ్ ను పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. అలాగే గూగుల్, పెట్రోనాస్, పెప్సికో సంస్ధల అధినేతలతోనూ భేటీ అయ్యారు. బిల్ గేట్స్ తోనూ భేటీ అయ్యారు. అయితే ఇందులో ఎక్కడా పెట్టుబడులు పెడతామన్న హామీ మాత్రం రాలేదు. అటు మంత్రి లోకేష్ కూడా పలు రౌండ్ టేబుల్ భేటీల్లో, వన్ టూ వన్ మీటింగ్స్ లోనూ పాల్గొంటున్నా పెట్టుబడుల ప్రకటనలు రాలేదు.

ఈ పర్యటనలో చంద్రబాబు ముందుగా.. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థతో చర్చించారు. మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో చంద్రబాబు చర్చలు జరిపినా.. ఒప్పందాలకు రాలేదు. ఆ తర్వాత డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో సమావేశమయ్యారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుతో పాటు, నెట్‌వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు. కానీ, నో రిప్లై. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌తో చర్చలు జరిపారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని కోరారు. కార్ల్స్‌బెర్గ్ గ్రూప్ తో కూడా భేటీ అయ్యారు. పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ చర్చలు జరిపారు. అటు ఆర్సెల్లార్ మిట్టల్‌ ప్రాజెక్టు ప్రతినిధులతో చర్చించారు. వెల్స్‌పన్ వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకాతో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు.

మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు భేటీ అయ్యారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, అలాగే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సూచనలు చేయాలని కోరారు.

ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో సమావేశమైన ముఖ్యమంత్రి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను కోరారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్, యాక్సెస్ హెల్త్ కేర్ సీఈవో అనురాగ్ జైన్, వాడ్‌కు చెందిన కౌన్సిలర్ ఆఫ్ స్టేట్… క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్, ఇసాబెల్లా మోరెట్, సింగపూర్ డిప్యూటీ పీఎం హెంగ్ స్వీ కీట్, యూఎన్ అండర్ సెక్రటరీ జనరల్ అనాక్లాడియా రాస్బాచ్‌తో సమావేశమయ్యారు. కానీ, ఒక్కచోట నుంచి కూడా ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం కుదరలేదు.

ఇద్దరు సక్సెస్​.. ఒకరికి బ్యాడ్​ లక్​

దావోస్​ వేదికపై ప్రధానంగా ముగ్గురు సీఎంలు కీలకంగా మారారు. తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డితో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ లతో కూడిన బృందం.. ఈ పెట్టుబడులపై పోటీ పడింది. అనుకున్నట్టే మహారాష్ట్ర కు ఉన్న అనుకూల పరిస్థితులు, ప్రధాన నగరాల కారణంగా రూ. 9.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు 1.78 లక్షల కోట్లు రాగా.. ఏపీకి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. దావోస్​ లో వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం సదస్సు జరిగినప్పటి నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులపైనే చర్చ సాగింది. ఇప్పుడు అందులో తెలంగాణ రైజింగ్​ ధమాక చూపించింది.

Leave A Reply

Your email address will not be published.