Take a fresh look at your lifestyle.

రెండో రోజూ అదే తీరు….కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళనలతో దద్దరిల్లిన ‘పురా’లు

 
తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్, కంటతడి
11 మున్సిపాలిటీల్లో ఎనిమిదింటిలోనే ఎన్నిక
8 చోట్ల ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ ఎన్నిక పూర్తి
ఏడు పుర పీఠాలు కాంగ్రెస్ కైవసం
బీఆర్ఎస్ ఖాతాలో ఇద్రేశం మున్సిపాలిటీ
కోరంలేక ఖానాపూర్‌లో.. క్యాతనపల్లిలో ఘర్షణతో వాయిదా
ఇబ్రహీంపట్నం ఎన్నికపై హైకోర్టు స్టే
మున్సిపాలిటీ పీఠం దక్కించుకున్న పార్టీ
ఇల్లందు కాంగ్రెస్
కాగజ్ నగర్ కాంగ్రెస్
డోర్నకల్ కాంగ్రెస్
తొర్రూర్ కాంగ్రెస్
సుల్తానాబాద్ కాంగ్రెస్
జహీరాబాద్ కాంగ్రెస్
జనగామ కాంగ్రెస్
ఇద్రేశం బీఆర్ఎస్
ముద్ర, తెలంగాణ బ్యూరో : 
మున్సిపాలిటీల్లోని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి.  ఈ నెల 16న వివిధ కారణాలతో వాయిదా పడిన మున్సిపాలిటీల్లో ఎన్నికకు అధికారులు మంగళవారం ఉదయం ఏర్పాటు చేశారు.  ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ స్థానాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులొడ్డాయి. పలుచోట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు ఆందోళనకు దిగాయి. వారి ఆందోళనల మధ్య అధికారులు ఎనిమిది చోట్ల ఎన్నికలు పూర్తి చేశారు. వీటిలో ఏడు పుర పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. దీంతో ఈ నెల 16న 81 స్ధానలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఖాతాలో మరో ఏడు మున్సిపాలిటీలు చేరగా… వాటి సంఖ్య 88కి చేరింది. ఇద్రేశం మున్సిపాలిటీని ప్రతిపక్ష బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఖానాపూర్‌లో కోరంలేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారుల ఆందోళనతో వాయిదా పడింది. కాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. ఎన్నికపై హైకోర్టు నుంచి స్టే రావడంతో అధికారులు వాయిదా వేశారు. 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కౌన్సిలర్‌ యాదగిరి కుమారుడు కిడ్నాప్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఎల్లుండిలోపు యాదగిరిని తమ ఎదుట హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనూహ్యంగా ఉదయం బీఆర్ఎస్ క్యాంపులో కౌన్సిల్‌ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారు. ఛైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాత అధికారులకు కోర్టు ఆదేశాలు అందాయి. స్టే కారణంగా బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ అభ్యర్థికి ధ్రువీకరణపత్రం ఇవ్వలేదు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేశాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అత్యంత రసవత్తరంగా సాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ ను ప్రారంభించిన అధికారులు.. చేతులెత్తి  చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించారు. దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలని గొడవకు దిగారు. ఎన్నికల నియమావళి ప్రకారమే ఓటింగ్ జరగాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత పెరిగి కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, రిటర్నింగ్ అధికారి పట్టుదలతో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. చివరికి ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగిన ఓటింగ్‌లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. 3వ వార్డు మెంబర్ టేకుల సుదర్శన్ రెడ్డి 15 ఓట్లతో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ప్రక్రియ సజావుగా సాగేందుకు 144, 163 సెక్షన్లను అమలు చేసిన పోలీసులు.. పట్టణమంతా భారీ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే వరంగల్‌లో వినియోగించుకున్నప్పటికీ, తొర్రూరులో ఎక్స్‌ఆఫిషియో ఓటును ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసనకు దిగారు. నిరసన నేపథ్యంలో పోలీసులు దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నరసింహారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నర్సింహులపేట వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, చివరకు దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఏడు మున్సిపాలీటీలు హస్తగతం
ఇల్లందు మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా  దొడ్డ కిరణ్‌మిత్ర ఛైర్మన్‌గా,  పెండేల రాజు వైస్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో హస్తం పార్టీ దక్కించుకుంది. అక్కడ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ చెందిన షాహిన్‌ సుల్తానా ఎన్నికయ్యారు. డోర్నకల్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్​గా కొండేటి రాజకుమారి, వైఎస్ ఛైర్ పర్సన్​గా మాద లావణ్యను ఎన్నికున్నారు. జనగామ, తొర్రూర్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూర్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. రెండుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉన్నాయి. దీంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఛైర్మన్‌ అభ్యర్థుల పేర్లు రావడంతో ఆ రెండు మున్సిపాలిటీలూ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బిరుదు కృష్ణ, వైస్ ఛైర్‌పర్సన్‌గా పుష్పలత ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఛైర్మన్‌గా యూనుస్ ఎన్నికయ్యారు. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎంఐఎం సభ్యుల మద్దతుతో కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ సురేష్ షెట్కార్ ఓటు వేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీని మాత్రం బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ఛైర్‌పర్సన్‌గా కె. ప్రమీల, వైస్‌ ఛైర్మన్‌గా హరీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
క్యాతన్ పల్లి, నిర్మల్ లో వాయిదా
క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక వాయిదా మళ్లీ పడింది. ఇరువర్గాల గొడవతో ప్రత్యేకాధికారి సతీష్ కుమార్ ఎన్నిక వాయిదా వేశారు. కోరం వచ్చినా అధికారులు ఎన్నిక నిర్వహించలేదు. ఎన్నిక చేపట్టాలని బీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ పార్టీ అభ్యర్థులతో కలిసి బయటకు వెళ్లారు. ఎన్నికల గదిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని వివేక్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని బీఆర్​ఎస్ నేతలు ఆరోపించారు. ప్రమాణ స్వీకారం తర్వాత అధికారులు కావాలని పది నిమిషాలు విరామం ఇచ్చారని, తమని కిడ్నాప్ చేయాలని కాంగ్రెస్ పథకం వేసిందని ఆరోపించారు. ఎన్నిక జరిగే సమావేశం మంత్రి వివేక్ ప్రసంగించడానికి అధికారులు అవకాశం ఇచ్చారని, బీఆర్​ఎస్, సీపీఐ బలాన్ని చూసి వివేక్ జీర్ణించుకోలేక పోయారని విమర్శించారు. సజావుగా జరపాల్సిన ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగానే వాయిదా వేశారని అన్నారు. అలాగే కోరం లేకపోవడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్​లోనూ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ ఎన్నికలు రెండో రోజు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు
ఎర్రబెల్లి కన్నీళ్లు :
తొర్రూర్ మున్సిపాలిటీ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తడంతో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్​కు తరలించారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.