ముద్ర , కరీంనగర్ :
కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
నిన్న జరిగిన ఈ ఘటనలో దుండగులు కాల్పులు జరపడంతో జ్యువెలరీ సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. ఘటన స్థలాన్ని పరిశీలించిన నేతలు, పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దుండగుల కాల్పుల్లో సిబ్బంది గాయపడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడడం తగదని విమర్శించారు.
మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ఇలాంటి ఘటనల్లో రాజకీయాలు చేయకుండా బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.
కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని కోరారు.
సంఘటన స్థలానికి వెళ్లి, గాయపడిన వారిని పరమార్శించిన నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్, పులి కృష్ణ, కుంభాల రాజు కుమార్, జీడి రమేష్, తదితరులు ఉన్నారు.