హైదరాబాద్ చుట్టూరా…
ఓవైపు క్యూర్.. నేచరల్ సీన్
క్యూర్.. ప్యూర్ రీజియన్ల మధ్యలో గ్రీన్ బెల్ట్
ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక హరిత జోన్
అటు ఓఆర్ఆర్ టూ ట్రిపుల్ ఆర్
చుట్టూరా రేడియల్ రోడ్లు
రేవంత్ సర్కార్ ప్రణాళికలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 1.10 లక్షల ఎకరాల్లో భారీ గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనిని 110 హరిత జోన్లుగా విభజించి ఆక్వా, అగ్రి బిజినెస్‌లను ప్రోత్సహించనుంది. రూ. 35 వేల కోట్లతో నిర్మిస్తున్న 340 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా 24 అర్బన్ క్లస్టర్లను అనుసంధానిస్తూ, కాలుష్య రహిత అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా.. క్యూర్.. ప్యూర్.. రేర్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. క్యూర్- ప్యూర్ రీజియన్ల మధ్యలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని పరిధిలో అందుబాటులోకి వచ్చే లక్షా పది వేల ఎకరాల భూముల్లో చెరువులతో పాటు ఆక్వా కల్చర్, అగ్రి బిజినెస్ వంటి వ్యాపారాలను చేయవచ్చు. ఈ భూములను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ.. ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా గానీ గ్రీనరీని పెంపొందించి ఆర్‌ఆర్‌ఆర్ లోపల భాగంలో సకాలంలో వర్షాలు కురిసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ ప్రస్తుతం అంతగా గ్రీన్‌బెల్ట్ లేకపోవడం, ఇండ్లు, పరిశ్రమలు పెరుగుతుండడంతో కాలుష్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్- ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో గ్రీన్‌బెల్ట్ వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య 110 ప్రాంతాలను హరిత జోన్లుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించనున్న 1.10లక్షల ఎకరాలను 110 గ్రీన్‌జోన్లుగా విభజించనున్నారు. ఇలా విభజిస్తే.. ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక హరిత జోన్ ఏర్పాటు కానుంది. ఇందులో ఆక్వా, అగ్రి బిజినెస్, చెట్లతో ప్రతి జోన్ ప్రాణవాయువు కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇక రీజినల్ రింగు రోడ్డును రూ. 35 వేల కోట్ల వ్యయంతో 340 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్నారు. 24 అర్బన్ క్లస్టర్లు, 208 గ్రామాలను కనెక్ట్ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ పరిధిలో 182 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ రింగ్‌రోడ్డు ప్రధాన రహదారిగా మారనుంది. ఔటర్ రింగు రోడ్డుతో పాటు చౌటుప్పల్, శివన్నగూడ, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డి మీదుగా వెళ్లనుంది. ఉత్తర తెలంగాణ పరిధిలో 158 కి. మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వద్ద ఈ రోడ్డు కలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు
హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రెడీ చేస్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ అంతా ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్ రోడ్ మధ్యే కేంద్రీకృతం కానుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రావిర్యాల, బుద్వేల్ వంటి ప్రాంతాల నుంచి 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగు రోడ్డు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా ఓఆర్‌ఆర్.. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ కేంద్రీకృతం కానుండటంతో అందుకనుగుణంగా ప్రణాళికలకు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ రావిర్యాల ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభయ్యాయి.
అంతేకాదు…
ఇదే కాకుండా బుద్వేల్ లేఅవుట్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కోస్గి వరకు మరో రేడియల్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బుద్వేల్ వద్ద దాదాపు రూ.400 కోట్లతో భారీ ఇంటర్‌ఛేంజ్, ట్రంపెట్ రోడ్డును నిర్మిస్తున్నారు. రాజేంద్రనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎయిర్‌పోర్టుతోపాటు ఇతర ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగించేలా ఈ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. రానున్న మూడేళ్లలో 3 నుంచి 4 రేడియల్ రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ సైతం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 80 లక్షల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఐటీ కారిడార్‌లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ఔటర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్ హబ్‌లు ఇతరత్రా అన్ని రకాల కార్యకలాపాలు ఒకేచోట కేంద్రీకృతం అయ్యేలా ఇప్పటి నుంచే హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది.
గ్రోత్ కారిడారు
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు అటు, ఇటు కిలోమీటర్ మేర గ్రోత్ కారిడార్‌గా పేర్కొంటున్నారు. అందులో భూ వినియోగ మార్పిడి, నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్‌ఎండీఏ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చెరువులు, వాగులు, జలవనరులు, అక్కడ ఉన్న గ్రీనరీని కాపాడేందుకు ఈ మాస్టర్‌ప్లాన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అడ్డగోలుగా రెడ్, ఎల్లో కేటగిరి పరిశ్రమలు రాకుండా వాటికి ప్రత్యేక ప్రాంతాలను కేటాయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బస్సులు, ఎంఎంటీఎస్, మైట్రో వంటి ప్రాజెక్టుతో వాటితో అనుసంధానం చేయనున్నారు.