Take a fresh look at your lifestyle.

రెండో రోజూ అదే తీరు..! రసాభసాగా మారిన గ్రామసభలు

  • కొనసాగుతోన్న నిరసనల పర్వం
  • ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ కమిటీలపై కొనసాగుతున్న నిలదీతలు
  • మంత్రులు సీతక్క, ఉత్తమ్​, భువనగిరి ఎమ్మెల్యేకు సెగ
  • కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్న ప్రజలు
  • పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
  • సభలు బహిష్కరించిన జనం.. మధ్యలోంచి వెళ్​లిపోయిన అధికారులు
  • ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇంటి కోసం సెల్ టవర్ ఎక్కిన పంచాయతీ కార్మికుడు
  • ఎమ్మెల్యే కడియం నియోజకవర్గంలో లంచాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారనే ఆరోపణలు
  • అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల బాహాబాహీ
  • ఇందిరమ్మ కమిటీల్లో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తిలో కాంగ్రెస్ నేతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు పలు చోట్ల రసాభాసగా మారుతున్నాయి. అర్హులైన వారిని ఎంపిక చేయడం  లేదని, పైరవీలు చేసిన వారికి, పార్టీ కార్యకర్తలనే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారన్న కారణాలతో కొన్ని చోట్ల, రాజకీయ కారణాలతో మరికొన్ని చోట్ల గ్రామసభలు వివాదాలతో సాగుతున్నాయి. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు తన అభ్యర్ధననను తిరస్కరించారంటూ ఖమ్మం – చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో పంచాయతీ కార్మికుడు పామర్తి శ్రీను సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

 

2008లో తనకు భార్య పేరుతో ఇందిరమ్మ ఇల్లు ముంజూరైందన్న శ్రీను అధికారులు దాన్ని ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ఇప్పుడు తనకు ఇల్లు లేదనీ తాజాగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరప్కరించారని మండిపడ్డాడు.కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు నకిలీ ధ్రువపత్రాలతో తన పేరు మీద ఇల్లు మంజూరు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేశాడు. జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామసభలో ఉద్రిక్తతనెలకొన్నది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధికారులు 500 మందికిపైగా నుంచి డబ్బులు వసూలు చేశారంటూ గ్రామస్తులు రహదారిపై బైఠాయించారు.

గ్రామసభలో అధికారులను అడ్డుకున్నారు.ఖమ్మం – కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామసభలో అర్హులైన తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ప్రజలు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ ను కూలగొట్టారు. స్టేషన్ ఘనపూర్ జాఫర్‌గఢ్ మండలంలోని తిమ్మంపేటలో గ్రామ సభలో మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరులు, అధికారులు లంచాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారంటూ సభను అడ్డుకున్నారు.పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామ సభలో ఆరు గ్యారంటీల హామీలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్​ కార్డులు, రుణమాఫీ, పెన్షన్లు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే సభ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోయిన ఎంపీడీవో తిరుపతి సభ ప్రారంభమైన అరగంటలోపే మధ్యలోంచి వెళ్లిపోయారు.

మంత్రులకు నిరసన సెగలు..

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో వార్డు సభకు హాజరైన మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. ఇందులో పలువురు ఆరు గ్యారంటీల గురించి మంత్రిని నిలదీశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తన సెగ్మెంట్​ పరిధిలోని అనంతారంలో గ్రామసభకు వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో పాల్గొన్న ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రసంగాన్ని స్ధానిక మహిళ అడ్డుతగిలింది. నారాయణపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం గురించి మంత్రిని నిలదీసిన ఆ మహిళ ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నించింది. సూర్యాపేట, బొల్లంపల్లి గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా నిజమైన అర్హుల పేరు లేవని అధికారులను నిలదీయడంతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం కల్పించుకుని ఎంపిక చేసిన పేర్లు చెప్పకండి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ప్రజల ముందు అధికారులకు సూచించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం వడ్లకొండ గ్రామ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వివాదం పరస్పరం దాడులకు దారితీసింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక..పథకాల తీరును ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో పరస్పరం దాడి చేసుకున్న కాంగ్రెస్ , బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి అక్కడి నుండి పంపించి వేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సంక్షేమ పథకాల ఎంపిక పేరుతో నిర్వహిస్తున్న గ్రామ సభలు ఘర్షణలు రేకేత్తిస్తున్నాయని పలువురు ఆరోపించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్ లోని దౌల్తాబాద్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రెండుగా చీలిన కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు ప్రకటించిన జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు మాకు రాలేదని ఓ వర్గం ఆందోళనకు దిగితే మరోవర్గం కూడా అదే ఆరోపణతో గొడవకు దిగింది. దీంతో అధికారులు అవాక్కయిన అధికారులు, ప్రజలు వారిని శాంతిపజేశారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డి రేపాక గ్రామంలో ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికలో అర్హులని అనర్హులుగా ఎంపిక చేయడంతో గ్రామస్థులు అధికారులను నిలదీశారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ అధికారులను నిలదీసిన అర్హులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు వారికి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు గంటసేపు అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రజలు అర్హులైన తమకు సంక్షేమ ఫలాలు అందకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామసభలో ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. 13 నెలలైనా ఏ ఒక్క హామీని పూర్తి స్ధాయిలో అమలు చేయడం లేదని ఆందోళనకు దిగారు. అధికారులు విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని కొందరు… రుణమాఫీ కాలేదని ఇంకొందరు అధికారులను నిలదీశారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ సభ నిర్వహించారు.

ఖమ్మం – వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని కోమట్ల గూడెంలో నిర్వహించిన గ్రామసభలో ఓ కాంగ్రెస్ నాయకుడు తనకు అనుకూలమైన వారిని అర్హుల జాబితాలో చేర్చారంటూ గ్రామస్థులు నిలదీశారు. అదే సమయంలో సదరు నాయకుడు గ్రామస్థులతో దురుసుగా వ్యవహరించాడు. అధికార పార్టీ నేత తీరుపై మండిపడ్డ జనం..కాసేపు సభను అడ్డుకున్నారు. ఆ నాయకుడు అక్కడ్నుంచి వెళ్లిపోయిన తర్వాత సభ నిర్వహణకు సహకరించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ లో జరిగిన గ్రామసభలో అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల అధికారులు ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అన్ని అర్హతలున్న తన పేరు లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ గ్రామస్తుడు.. అధికారుల వద్ద ఉన్న అర్హుల జాబితా ను తన వెంట తీసుకెళ్లిపోయాడు.

గ్రామస్తుడి తీరుపై ఖంగుతిన్న అధికారులు అర్హుల జాబితా లేకపోవడంతో తలలు పట్టుకున్నారు. నిజామాబాద్ వేల్పూరు మండలం మోతే గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రసాభాస జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు ఏం చేశారని నిలదీశారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా లబ్ది చేకూరుతుందనే నమ్మకం లేదని చెప్పారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీపై అధికార పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేశారు.కీసర గ్రామ ఇంద్రమ్మ కమిటీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ గ్రామ కమిటీ సభ్యులు తాము తీర్మానించిన పేర్లు కాక కొత్త పేర్లు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిదిలోని పాలేరు గ్రామ సభలో ప్రజలు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఆరుగ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. జగిత్యాల జిల్లా కోడీమ్యాలలో నిర్వహించిన గ్రామ సభలోనూ ప్రజలు అధికారులను నిలదీశారు.

వరంగల్ – నల్లబెల్లి గ్రామసభ నేపథ్యంలో పోలీసులు దుకాణాలు బంద్​ చేయించడం వివాదస్పమైంది. పోలీస్ నిర్బంధంలో నల్లబెల్లిలో గ్రామసభ నిర్వహించడంతో తక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. జనగామ జిల్లా నర్మెట మండలం డీసీ తండా గ్రామంలో జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ పథకాలు రాలేవని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.వనపర్తి జిల్లా గోపాలరావుపేట సభలో అర్హులైన తమకు సంక్షేమ పథకాలు రాలేదని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట గ్రామ సభలో పేదలకు పథకాలు ఇవ్వరా అంటూ గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో ప్రజలకు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాలో ముగ్గురు మంత్రుల పథకాలు ఇవ్వడం లేదంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం రేపాల గ్రామసభలో గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రేషన్ కార్డు జాబితాలో తమ పేర్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా పథకాల లబ్ది చేకూరుతుందా..? లేదా.? అని నిలదీశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, ఆసుపాక గ్రామ సభలో మహిళలు,అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. హన్మకొండ జిల్లా వరికోల్ గ్రామసభలో ఓ మహిళ అధికారులతో వాగ్వాదినికి దిగింది. అర్హురాలినైన తనకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదని కనీసం ఇటీవల విడుదల చేసిన జాబితాలోనూ పేరు లేదని మండిపడింది. బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామసభను గ్రామస్థులు అడ్డుకున్నారు. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా మంజూరు చేస్తామని నిలదీశారు. దీంతో అధికారులకు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సద్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. జనగామ నియోజకవర్గం వడ్లకొండ గ్రామసభలో ఇల్లు రాలేదని అడిగిన పలువురిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం వివాదస్పదమైంది.రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇల్లు రాలేదని అడిగితే కొడుతున్నారంటూ ప్రజలు నాయకులపై తిరగబడ్డారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామసభలో తమకు ఇంత వరకు రుణమాఫీ కాలేదంటూ రైతులు కాంగ్రెస్ నాయకులు.అధికారులను నిలదీశారు. కాంగ్రెస్​ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబా జిల్లా తొర్రూరు మండలం నాంచార గ్రామంలో అర్హులకు పథకాలు రావడం లేదని మహిళలు అధికారులపై తిరగబడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామ సభలో అర్హులకు పథకాలు ఇవ్వడం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్ గల్ మండలం బేగంపూర్ గ్రామ సభలో భూమి ఉన్నవారికి, అనర్హులకు పథకాలు వస్తున్నాయని, భూమి లేని పేద ప్రజలకు, అర్హులకు పథకాలు రావడం లేదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గ్రామ సభలో పేదలకు, అర్హులకు పథకాలు అందడం లేదని అధికారులను, పోలీసులను నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.