- బీసీగణనకు శాస్త్రీయత లేదు.
- కావాలనే బీసీ జనాభా తగ్గించి చూపించారు.
- అందుకే ఆ సంఘాలు ఆ జనగణనే బంగాళాఖాతంలో వేశాయి.
- మోదీ మాటిస్తే దేశమంతా నమ్ముతుంది.
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన తప్పులతడక అని బీసీగణనకు శాస్త్రీయత లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందన్నారు.ప్రభుత్వం కావాలనే రాష్ట్రంలో బీసీ జనాభాను తగ్గించి చూపించారని మండిపడ్డారు.అందుకే ఆ గణనను బీసీ సంఘాలు బంగాళాఖాతంలో వేశాయన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో పౌర గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఈటల రాజేందర్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.48 ఏళ్లకేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జనగణన గుర్తుకు రాలేదన్నారు.ఇప్పుడు రాజకీయ స్వార్ధం కోసమే జన, కులగణనకు పట్టుబడుతుందని ఆరోపించారు.తాజాగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో జనగణనతో పాటే కులగణన చేయాలని నిర్ణయించిందని చెప్పారు.ప్రధాని మోదీ మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందని ఈటల చెప్పారు.కేంద్రం చేసే కులగణన బీసీల్లో రాజకీయ, సామాజిక, ఆర్ధిక, విద్యా పరంగా వరంగా మారుతుందని ఎంపీ హామీ ఇచ్చారు.దేశంలో నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని వెల్లడించారు.
- హైడ్రా పేరిట కాంగ్రెస్ విధ్వంసం.
ఆక్రమిత స్థలాల పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేస్తూ వారి భూములను స్వాధీనం చేసుకుంటున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు కోర్టులు మొట్టికాయలు వేసినా బుద్ధి రావడం లేదని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.పేదల ఇళ్లు కూల్చివేసినా, భూములు లాక్కున్నా ప్రభుత్వం అంతు చూస్తామని హెచ్చరించారు.నల్లచెరువు పక్కన ఉన్న ప్రైవేట్ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంటుందని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారంటూ అక్కడి స్థానికులు ఎంపీ ఈటలకు ఫిర్యాదు చేశారు.వారి విజ్ఞప్తి మేరకు గురువారం బాధితుల దగ్గరికి వెళ్లిన ఎంపీ ఈటల రాజేందర్..ఆ భూములను పరిశీలించారు.అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. ప్రజల ఆగ్రహంతో హైడ్రా తోక ముడిచిందన్న ఆయన పేద ప్రజల ఆక్రందనలకు, ఆవేదనకు దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డి దారిన మరో పిచ్చి పని చేస్తున్నాడని దుయ్యబట్టారు.గతంలో హైడ్రా పేరుతో నిర్ధాక్షణ్యంగా షట్టర్లు కూల్చివేస్తే మనోవేదనకు గురైన బుచ్చమ్మ చనిపోయిందని చెప్పారు.ప్రస్తుతం నల్లచెరువు విస్తీర్ణం 20 ఎకరాలు ఉంటుందనీ అందులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి 7.36 ఎకరాలు మాత్రమేనన్నారు.మిగిలినదంతా రైతుల పట్టా భూములు అని ఈటల చెప్పారు.హైదరాబాద్ లో అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువుల పారుదల లేదని చెప్పారు.వ్యవసాయ పొలాలకు నీటి నిలిపివేత తర్వాత ఎఫ్ టీఎల్ అన్ని పోయి ఈ పట్టా భూములలో మట్టి నింపుకొని షెడ్డులు వేసుకొని వాడుతున్నారని చెప్పారు.నల్లచెరువులో ఉన్న ప్రైవేట్ రైతుల భూములు నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు పెట్టి వాటిని బావులు లెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టా భూములు ఉన్న రైతులు హైడ్రా అధికారులను, రెవెన్యూ అధికారులను వేడుకున్నారన్నారు.ఎక్కడ నుంచి సమాధానం రాకపోతే చివరికి హైకోర్టు మెట్లు ఎక్కారన్నారు.వీటి పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు..ప్రైవేటు పట్టా భూముల్లో ఏలాంటి చర్యలు చేపట్టవద్దనీ, వాళ్లని ఇబ్బంది పెట్టొద్దని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టు, చట్టమంటే గౌరవం లేదని ఆరోపించారు. ఒకవేళ నల్లచెరువుని బ్యూటిఫికేషన్ చేయాలి అనుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ పట్టా భూములకు ఎంత విలువైతే ఉంటుందో అంత భూమి లేదా పరిహారం నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము మూసి ప్రక్షాళనకు, చెరువుల బ్యూటిఫికేషన్ కు వ్యతిరేకం కాదని ఎంపీ ఈటల స్పష్టం చేశారు.ప్రైవేట్ వ్యక్తుల ఇల్లు గుంజుకుంటా అంటే ప్రైవేట్ పట్టా భూముల గుంజుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.
