- కాళేశ్వరం కమిషన్ ఎదుట తనకు తెలిసిందే ఈటల చెప్పారు.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని ఆయన సూచించారు.ఈ మేరకు శనివారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా కిషన్ రెడ్డి మాట్లాడారు.. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్ళు తీసిన సంగతి నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.కాళేశ్వరం కమిషన్ విచారణలో తమ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తనకు తెలిసిన విషయాలే చెప్పారన్నారు.గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఈ వీఎంల ట్యాంపరింగ్ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు.ఎన్డీఏ 11 ఏళ్ల పాలన పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ సారి అసంబ్లీపై ఎగిరేది కాషాయ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.