- ఫలించిన మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ యత్నాలు.
- రోడ్డు విస్తరణతో తీరనున్న వెతలు.
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నుండి కళ్యాణ్ 61 వ జాతీయ రహదారిని ప్రస్తుత రెండు వరుసల రోడ్డును ఫోర్ లేన్ గా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పరిధిలోని 53 కి.మీ లు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. గతంలో నిర్మల్, ముధోల్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ లతో పాటు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ విశేషంగా కృషి చేశారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ పనుల పై విన్నవించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 15 రోడ్లను నాలుగు వరుసల జాతీయ రహదారులుగా నిర్మాణం కోసం రూ. 33,690 కోట్ల ను వెచ్చించి 2028 సంవత్సరం వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి డి పి ఆర్ ను త్వరగా తయారు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రోడ్డు ప్రమాదాలతో పాటు, ట్రాఫిక్ సమస్యలు కూడా తీరనున్నాయి.జాతీయ రహదారి విస్తరణలో నిర్మల్ జిల్లా కు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణలో గడిచిన 11 సంవత్సరాలలో వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని వారన్నారు.