Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…
హాజరైన జిల్లా కలెక్టర్, ఎస్పీ లు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో
ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద గల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మూల విలువలను రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువత విద్యను సాధనంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. సామాజిక న్యాయం సాధించడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని తెలిపారు. రాజ్యాంగం ద్వారానే ఏర్పడిన ప్రభుత్వాలు అభివృద్ధి మరియుసంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగం అందించిన అవకాశాలను ఉపయోగించుకొని వ్యక్తిగతంగా ఎదిగి జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన చూపించిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అంతేకాకుండా విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని, యువత అంబేద్కర్ బాటలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.
ఆర్థిక అసమానతలను తొలగించాలంటే విద్య ద్వారానే సాధ్యమని మనందరం మన పిల్లలతో పాటు చదువుకోలేని వారికి చదువు విలువ తెలిపి చదివుకునేలా చేయాలని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R.అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ (Articles) పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతకుముందు కళాజాత కళాకారుల బృందం చే అంబేద్కర్ మహనీయుని గొప్పతనం గురించి పాటలు పాడి అందరిని అలరించారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి.రాజ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, DFO సురేష్, DPRO నరేష్, జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ లు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.