కాంగ్రెస్ పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుంది
ఇవ్వాల్సింది పోయి.. లాక్కుంటోంది
అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్క తీయాలి
వెనుగుమట్ల నిరాశ్రీయులకు పరామర్శ
ముద్ర, ఖమ్మం :
కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి కేవలం నిరుపేదల ఇండ్లు కూల్చివేయటం ఏంటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ఆ లెక్కలు తీసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల బాధితులను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని నాడు ప్రజల తిరుగుబాటును చూసి కేసీఆర్ వెనక్కి తగ్గారన్నారు. రేవంత్ రెడ్డికి పేదల ఇళ్లను కూల్చడం మాత్రమే తెలుసన్నారు. పేదలకు భూములు ఇవ్వకపోగా ఉన్నది కూడా లాక్కుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లపై కన్నేసిందని ఆరోపించారు. వెనుగుమట్లలో అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారన్న ఆాయన.. వంటసామాగ్రినీ ఎత్తుకుపోయారని మండిపడ్డారు. శత్రుదేశం దాడి చేసినట్లుగా ప్రభుత్వం పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ ఘటనతో తేటతెల్లమైందన్నారు. కూల్చిన చోటే కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఎల్ఏ సుమోటోగా ఒక ఆర్డర్ ఇచ్చి యుద్ధభూమిని తరలించేలా ఇళ్లను కూలగొట్టిందని మండిపడ్డారు. చిన్నపిల్లలు గర్భిణీలు వృద్ధులనీ కూడా చూడకుండా వారి సామాగ్రిని డోజర్లతో తొక్కించి, శత్రువుల మీద దాడి చేసినట్లు చేశారని ధ్వజమెత్తారు. సభ్య సమాజమే తలదించుకునే నీచానికి సీఎం రేవంత్ రెడ్డి ఒడిగడ్డారని విరుచుకుపడ్డారు. కేసులు పెడితేనో, జైలులో పడితే తెలంగాణ సమాజం భయపడేది కాదన్న ఈటల… సందర్భం వచ్చినప్పుడు దుర్మార్గపు ప్రభుత్వాన్ని తొక్కి భూస్తాపితం చేస్తుందన్నారు. వెలుగుమట్ల ప్రజానికి తెలంగాణలో ఉన్న ప్రజలంతా అండగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వానికి గద్దెనెక్కించిన ప్రజలు.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని బాధపడుతున్నారని చెప్పారు.