Take a fresh look at your lifestyle.

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి : ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

 

— ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు

— ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజ

— 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి,ఖమ్మం:

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం తోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం భక్త రామదాసు కళా క్షేత్రంలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభ సమయంలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, ఇందిరా మహిళా శక్తి క్రింద బ్యాంకు రుణాలు కల్పన వంటి చర్యలతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఖమ్మం జిల్లాలో పూర్తయ్యాయని వెల్లడించారు.
ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఇటీవల ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు ప్రజలకు మరింత చేరువై సేవలు అందించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ప్రజాప్రతినిధి వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని, పారిశుధ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్య చర్యలతో సీజనల్ వ్యాధులను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించనున్నట్లు, పాఠశాల విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నట్లు చెప్పారు. వికలాంగ విద్యార్థులకు బ్యాటరీ ఆధారిత వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
అంతకు ముందుకు ఖమ్మం జిల్లా స్థాయి శాఖల అధికారులు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలు లబ్ధిపొందుతున్న వివరాలను వెల్లడించారు. రాబోయే ప్రభుత్వ పథకాలను ప్రజలకు కలెక్టర్ సంపూర్ణంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, గ్రామ సర్పంచ్ లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.