ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు ఇకలేరు
బ్రాహ్మణ కోడూరు లో జన్మించి మిర్యాలగూడలో మొదటి రైస్ మిల్ ప్రారంభించారు
ప్రజా ఆలోచన వేదిక స్థాపించి అసమానతులను అవమానాలను రూపుమాపారు
బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పోరాట యోధుడు
సమాచార హక్కు చట్టం పోరాట ఉద్యమ ఫలితం ఆర్టిఐ చట్టం అమలు
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ స్థాపనతో ప్రభుత్వం ఆసరా ఏర్పాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు ఇకలేరు. ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరుందిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మలేషియన్ టౌన్ షిప్ (రెయిన్ ట్రీ పార్క్) లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అపోలో మెడికల్ కళాశాలకు అందజేశారు.
గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు గ్రామంలో ఉప్పల లక్ష్మీనారాయణ ఉదయ లక్ష్మీ దంపతులకు 1-3-1936న జన్మించారు. చిన్నప్పటినుండి సామాజిక స్పృహ గల విద్యార్థిగా ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. వ్యాపారం చేస్తే పదిమందికి మేలు చేకూర్చవచ్చనే ఉద్దేశంతో రైస్ మిల్ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మిర్యాలగూడలో మొట్ట మొదటి రైస్ మిల్ ను స్థాపించారు. కష్టపడే వాడికి కమ్మనైన భోజనం దొరకాలి అన్న ఉద్దేశంతో 1976 సంవత్సరంలో ప్రజా ఆలోచన వేదికను ప్రారంభించారు. అప్పటి నుండి సమాజంలో నెలకొన్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడానికి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధులను ప్రోత్సహించేవారు. సామాజిక స్పృహతో సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యల కోసం అధికారులు జవాబుదారీగా ఉండాలని కోరేవారు. ప్రతి ఏడాది క్రమశిక్షణతో పని చేసే మున్సిపల్ సఫాయి కార్మికులను సన్మానించేవారు. ప్రతి ఏడాది ఉత్తమ విద్యార్థులకు నగదు వారితోషకం అందించి ప్రోత్సహించారు.
తన జీవితమంతా పేద ప్రజల కోసం న్యాయం ధర్మం చట్టం పోరాటాలతో ప్రజల పక్షాన ఉన్న స్వర్గీయ ఉప్పల గోపాలరావు మరణానంతరం సైతం తన ఇష్ట ప్రకారం తన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించాలని సూచించడంతో అంతిమ గడియలను సైతం సమాజానికి అంకితం చేయడం విశేషం.
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.