ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
పాలమూరు… జిల్లా అంటే ఒకప్పుడు కరువు, వలసలు, బీడుపడిన పంటపొలాలు, తాగునీటికి తంటాలు, బిందెడు నీటి కోసం కిలోమీటర్ల పరుగు, పేద ప్రజల దుర్బర జీవితాలు… తెలంగాణ జిల్లా ల్లో పాలమూరు గురించి ఒకప్పుడు ఇలా మాట్లాడుకొనేవారు. పాలమూరు జిల్లా అంటేనే చిన్న చూపు..కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.అన్నీ రంగాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని తలెత్తుకుని గౌరవంగా నిలబడింది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక రంగం లో దూసుకుపోతోంది.ఒక వైపు ఆధ్యాత్మిక , మరోవైపు ఆహ్లాదకరమైన ప్రాంతాలతో ఈ జిల్లా పర్యాటక రంగంలో విరాజిల్లుతోంది. పాలమూరు పర్యాటక రంగం పై ‘ముద్ర ‘ అందిస్తున్న ప్రత్యేక కథనం.
…………………………………..
ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఆహ్లాదపరిచే స్థలాలు ఎన్నో కనువిందు చేస్తున్నాయి. పాలమూరు పిల్లలమర్రి తో పాటు జోగులాంబ అమ్మవారు,ప్రతేకత ఉన్న మన్యంకొండ, కురుమూర్తి ఆలయాలు, జూరాల, కోయిల్ సాగర్, రామన్ పాడు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, గద్వాల కోట, సలేశ్వరం, ఉమా మహేశ్వర ఆలయం ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు

పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఈ ఆలయాలు వేటికవే ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
………………………………….
జోగులాంబ అమ్మవారు :
………………………………..

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో వెలసిన శక్తి పీఠం. పలు దేవతా విగ్రహాల సమూహంతో ఈ ఆలయం నిర్మించారు.శక్తి రూపమైన జోగులాంబ దేవి హిందూ దేవాలయమిది. పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయం, తుంగభద్ర నది ఒడ్డున నిర్మితమై ఉంది. ఆలంపూర్ లో ఏడవ, ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది.జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధానంగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వం తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్‌మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారు.
ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడిందనీ చరిత్ర చెబుతోంది.విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచాడని చరిత్రలో ఉంది.ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి, దాచిపెట్టారనీ,అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.ఈ ఆలయం హైదరాబాద్ కు 200 కిలోమీటర్లు, కర్నూల్ జిల్లా కు కేవలం 25 దూరం లో ఉంది.
………………………………….
మన్యంకొండ దేవాలయం :
………………………………….

‘తీరితే తిరుపతి..తీరకుంటే మన్యంకొండ అనే నానుడి’ ప్రచారం ఉంది.పాలమూరు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో కొండ పై వెలిసిన ఉన్నారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి. కొండ కింది భాగంలో అలివేలుమంగమ్మ ఆలయం ఉంది.ఇది ఒక మహా పుణ్యక్షేత్రం. పేదల తిరుపతిగా పేరొందిన ఈ ఆలయం పాలమూరు నుంచి రాయచూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో ఉంది. ఎత్తయిన కొండపై స్వామివారు కొలువై ఉన్నారు . మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం. వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. కేశవయ్య అనే మునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని, నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ చెప్పారని స్థలపురాణం తెలుపుతొంది. ఆ మరుసటి రోజు కేశవయ్య మన్యంకొండను ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఎత్తయిన కొండపై ఘాట్‌రోడ్ నిర్మించారు అలహరి రామయ్య.కోనేరు, మంచినీటి బావిని కూడా తవ్వించారు . ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం మునులకొండగా పిలువబడిన కాలక్రమేణా మన్యంకొండగా స్థిరపడింది.
………………………………..
కురుమూర్తి ఆలయం :
………………………………….

చిన్న చింత కుంట మండలం లోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఈ ఆలయం వెలసి ఉన్నది. ఏడుకొండల మధ్య స్వయంభూ లక్ష్మి సమేతంగా వెలిసి ఉనన్న వెంకటేశ్వరస్వామి పేదల తిరుపతిగా మొక్కులందుకుంటున్నారు.. కురుమూర్తి వేంకటేశ్వరస్వామి దేవస్థానం ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించారని చరిత్ర చెబుతోంది.
సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ప్రతి ఏడాది జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. ఈ వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమవుతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. పాదుకలతో వీపు పై కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
ప్రతియేటా జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయం లో కొండ కింద కాల్చే మటన్ కు ప్రత్యేకత. ఈ జాతరకు వచ్చే వారు ఈ మటన్ రుచి చూడందే తిరిగి వెళ్లారు.
…………………………………..
స్థల పురాణం :
……………………………………
ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్ళి చేసుకోడానికి కుబేరుని వద్ద అప్పుచేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందిన స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేశారని స్థల పురాణం లో ఉంది.
అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక గుర్తురావడంతో అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించి అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది.కుబేరుని అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందినది.
…………………………………..
పిల్లలమర్రి :
……………………………………

పాలమూరు జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. దూర ప్రాంతాల నుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి ప్రజలు తరలివస్తుంటారు. సుమారు 700 సంవత్సరాల నాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలా కనిపిస్తుంది.దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్భుత అనుభవం. ఈ మహావృక్షం మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియం ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన
సౌకర్యాలున్నాయి.పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం ఆకట్టుకొంటున్నాయి.
……………………………….
గద్వాల కోట
………………………………..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోనే ప్రసిద్ధి గాంచిన కోట.గద్వాల పట్టణం నడి బొడ్డున ఉన్న ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు నిర్మించారు . ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించారు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కొనసాగుతున్నాయి.1663 నుంచి 1950 వరకు గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండిన ఈ కోట సంస్థానాల రద్దు తరువాత ప్రభుత్వ పరమైంది. రాష్ట్ర ప్రభుత్వం 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోటలో ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలగా పేరుపెట్టారు . చినసోమభూపాలుని హయంలో అష్టదిగ్గజాలనే 8మంది కవులుండేవారు. వీరి కాలంలో సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. అందుకే గద్వాలకు విద్వద్గద్వాల అని పేరు ఉంది. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు.ఈ కోట లో సినిమాలు కూడా చిత్రీకరణ లు కూడా జరిగాయి.
…………………………….
సలేశ్వరం :
……………………………..

శ్రీశైలం దేవస్థానానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలేశ్వరం నల్లమల అటవీ ప్రాంతం లో ఉంది.
ఇది ప్రకృతి రమణీయతతో అందమైన ప్రదేశం, చారిత్రిక, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వుంటుంది. 5 కిలొమీటర్లు మాత్రం కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఏడాది లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులవుతారు.
ఎత్తైన రెండు గుట్టల మధ్యలో లోతైన లోయ లోకి జలదార పడుతుంది. రెండు గుట్టల మధ్య ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఏమరు పాటుగా కాలు జారితే ప్రాణాలకే ప్రమాదం.గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుంచి ఆకాశం కనబడుతుంది. గుండంలోని నీరు వనమూలికలతో కలిసి ఉంటుందని భక్తుల నమ్మకం.ఆ గుహలోనే లింగమయ్య స్వామి లింగ రూపం లో ఉంటారు. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మ విగ్రహాలంటాయి.
………………………………………..
ఇవేకాకుండా పాలమూరు జిల్లా కేంద్రంలో సమీపంలో ఎకో పార్క్ టూరిజం అభివృద్ధి చేశారు. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు లో తీగల వంతెనను నిర్మించారు. బోటింగ్ సౌకర్యం కూడా గతం లో ఉండేది ప్రస్తుతం చెరువు శుద్ధి చేయడం వల్ల నీరు లేక బోటింగ్ అందుబాటులో లేదు. జడ్చర్ల సమీపంలో ఏకశిలా వినాయక విగ్రహం కొలువై ఉంది. వర్షాకాలం లో జూరాల ప్రాజెక్టు నీటి సవ్వడి తిలకించేందుకు రాష్ట్రం నాలుమూల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా లో అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.