– పాలమూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక లో మల్లగుల్లాలు
– ఎమ్మెల్యే… డీసీసీ అధ్యక్షుని వర్గం మధ్య పోటాపోటి
– గాంధీ భవన్ కు చేరిన నగర అధ్యక్ష ఎన్నిక పంచాయితీ
– ఇప్పటికే పాలమూరులో రెండుగా చీలిన కాంగ్రెస్
– మళ్ళీ పదవుల కోసం రెండు వర్గాల మధ్య రచ్చ రచ్చ
– పదేళ్ల తరువాత అధికారం లోకి వస్తే ఇదేమి లొల్లి అంటూ అయోమయం లో పార్టీ శ్రేణులు
– రెండు వర్గాలను బుజ్జగించడం లో అధిష్టానం ఫెయిల్
– పాలమూరు లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరం
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………….
పాలమూరు కాంగ్రెస్ లో మళ్ళీ పదవుల గొడవ తెర పైకి వచ్చింది.ఇప్పటికే పార్టీ రెండు వర్గాలతో సతమతం అవుతుంటే ప్రస్తుతం నగర కాంగ్రెస్ అధ్యక్షుని పదవి కోసం కీచూలాట మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత జరిగిన పరిణామలతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చిలిపోయింది.మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి విషయం లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మధ్య విబేధాలు రావడం తో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఆనంద్ గౌడ్ కు మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుని తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత,తన కుమారునికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబేదుళ్ల కొత్త్వాల్ పట్టుబట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ సొంత కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారని, అయనకు మేయర్ పదవి ఇవ్వవద్దని ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎన్ పి వెంకటేష్, వినోద్ కాంగ్రెస్ అధిష్టానం, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆనంద్ గౌడ్ భార్య కు మేయర్ పదవి దక్కలేదు.

ఎమ్మెల్యే ముదిరాజ్ వర్గానికి మేయర్ పదవి కట్టబెట్టారు. డిప్యూటీ మేయర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. దీంతో డీసీసీ అధ్యక్షులు, డీసీసీ మాజీ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు ఆనంద్ గౌడ్ కలిసి కాంగ్రెస్ లో మరో కుంపటి పెట్టారు. ఎమ్మెల్యే వర్గం, డీసీసీ వర్గం అప్పటినుంచి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.ఎమ్మెల్యే పాల్గొంటున్న కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్ష వర్గం దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ పాలమూరు నగర అధ్యక్షుని ఎంపిక కోసం రెండు వర్గాలు పోటా పోటీగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాత్రం మైనారిటీ లకు ఇవ్వాలని అధిష్టానం దృష్టి కి తీసుకెళ్లారు.మైనారిటీ నేత, ప్రస్తుత కార్పొరేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాద్రి పేరును తెర పైకి తెచ్చారు. ఒకవేళ మైనారిటీ లకు కాకుంటే ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్ పదవి కాలంలో ముగియడం తో ఆయనకు నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం చెప్పినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి నగర అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే కాంగ్రెస్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుని వర్గం మాత్రం మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కు నగర అధ్యక్షుని గా అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మేయర్ ఎంపిక లో ఆనంద్ గౌడ్ కు అన్యాయం జరిగిందని, అందుకోసం పార్టీ కి కష్ట పడుతున్న ఆయనకే ఈ పదవి ఇవ్వాలని డీసీసీ వర్గం పట్టుబడుతోంది. ఈ రెండు వర్గాల పంచాయితీ గాంధీ భవన్ కు చేరింది.
రెండు వర్గాల పంచాయితీ కాంగ్రెస్ అధిష్టానం కు తలనొప్పిగా మారింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ వద్ద ఈ పంచాయితీ నడుస్తోంది. ఈ రెండు వర్గాలను ఏకం చేయడం లో అధిష్టానం పూర్తి గా విఫలం చెందిందని పలువురు కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఈ పదవుల పంచాయితీ వల్ల పాలమూరు కాంగ్రెస్ శ్రేణులు అయోమయం లో ఉన్నారు. పదవుల కోసం పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు లో కాంగ్రెస్ నేతల పంచాయితీ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగుకాక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాలమూరు లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కళ్లు తెరవక పోతే… ఈ రెండు వర్గాలు ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ కష్టమే అని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.