Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం

 

ముద్ర, కరీంనగర్ :

రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ కేంద్రం కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆధునిక సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వీధి కుక్కలకు శాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్సలు నిర్వహించి, రేబిస్ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు చెప్పారు. జంతువుల సంఖ్యను నియంత్రించడం ద్వారా నగరంలో కుక్కల బెడద తగ్గడమే కాకుండా ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే వ్యాధులను కూడా నియంత్రించవచ్చని వివరించారు. జంతువులకు ఎలాంటి హాని కలగకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

నగర పాలక సంస్థ జంతు సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు, వెటర్నరీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.