Take a fresh look at your lifestyle.

టీబీజేపీలో ముదిరిన పాత, కొత్త లొల్లి – అధ్యక్ష పీఠంపై నేతల్లో అయోమయం

  • బీసీ నేతకే అధిష్టానం మొగ్గు
  • వర్గాలుగా వీడిన సీనియర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ శాఖలో పాత, కొత్త నేతల లొల్లి ముదిరి పాకాన్న పడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని బీసీ నేతలకే కట్టబెడతారని, అందులోనూ ఎంపీ ఈటల రాజేందర్ కే బాధ్యతను అప్పగిస్తారనే ప్రచార క్రమంలో బీజేపీ నేతల్లో అయోమయం నెలకొంది. ప్రధాన బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఎం. రఘునందన్ రావు, డి.కె. అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఢిల్లీ నాయకత్వం పేర్లను స్క్రీనింగ్ చేసే పనిలో పడింది. బీసీ నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని, దాదాపు ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు, అధికారిక ప్రకటనే తర్వాయి అని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందులోనూ ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఎంపీ ఈటల రాజేందర్ కే అధ్యక్ష పీఠం అన్నట్లుగా మీడియా చిట్ చాట్ లో లీక్ చేశారు. దీంతో బీసీ వ్యక్తికే పార్టీ పగ్గాలనే వాదనకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామాలతో బీజేపీలోని అసంతృప్తి నేతలు కొందరు ఢిల్లీలోని కేంద్ర నాయకత్వం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట.

పార్టీ చీఫ్ గా సంఘ నేపథ్యం లేనివారికి కాకుండా కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే పలు అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని, అసమ్మతి పెరుగుతుందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ నాయకత్వం పార్టీలోని రాష్ట్ర ముఖ్య నాయకులకు ఫోన్లలో మెట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది. టీ బీజేపీ చీఫ్ ను తామే ప్రకటిస్తామని, ఈ విషయంలో ఎవరు బటయ మాట్లాడవద్దని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ళుగా తెలంగాణలో పగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి పరిస్థితులు అనుకూలించడం లేదు. గతంలో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. అలాగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. అయినప్పటికీ 2028లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తోంది. తెలంగాణకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. టీబీజేపీలో జరుగుతోన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలోని నేతల మధ్య సమన్వయం లోపించడం, సీనియర్లు వర్గాలు విడపోవడం పట్ల అధిష్టానానం అగ్రహంతో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ బీజేపీ కొత్త చీఫ్ ను ప్రకటిస్తే , అసమ్మతి వర్గం రెచ్చిపోయే అవకాశాలను కూడా అధిష్టానం గమనిస్తోంది. దీంతో బీజేపీ కొత్త బాస్ నియామకాన్ని ఈ నెలాఖరున గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.