Take a fresh look at your lifestyle.

పెట్టుబడులకు వేదిక హైదరాబాద్ 

  • అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ.
  • సామాజిక న్యాయం పునాదిపై ఆర్థిక అభివృద్దే.. కాంగ్రెస్ సిద్ధాంతం.
  • అసోచామ్ సదరన్ కౌన్సిల్ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్ని రచిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాదులోని  ది వెస్టిన్, మైండ్ స్పేస్ లో అసోచామ్ సదరన్ సిఎస్ ఆర్, సస్టేనబిలిటి  కౌన్సిల్ సదస్సు, అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యత లతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు పని చేస్తోందన్నారు.ప్రస్తుతం మనం అపార వనరులు ఉన్నా కానీ అసమానతలు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామన్నారు.’ ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థలు పనిచేయలేవని స్పష్టం అయ్యిందన్నారు. ఇప్పుడు కేవలం లిఫ్ట్ ఆల్’ అందరినీ అభివృద్ధి చేయాలన్నది అనివార్యం అన్నారు. ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం పునాదిపై నిలవాలని కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంత మన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తుందన్నారు.పారిశ్రామికవేత్తల చర్యలు దానం కోసం కాకుండా బాధ్యత కోసం కావాలన్నారు. మీ పని ప్రశంసల కోసం కాదు సామాజిక మార్పు కోసం అని స్పష్టం చేశారు కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు ఖర్చు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అన్నారు.ఈ రాష్ట్రంలో మీరు అనుకున్న లక్ష్యాలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే కాదు, ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉందన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సీఎస్ ఆర్ నిధులు ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతమన్నారు. ఇక్కడ అనుకూలమైన అందరికీ సరిపోయే వాతావరణం ఉందన్నారు. అలాగే భాషా సమస్య లేదన్నారు. శాంతిభద్రతలు, తక్కువ ధరకు పుష్కలంగా లభించే మానవ వనరులు, అన్నిటికీ మించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇక్కడ ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం  దేశంలోని రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన  దేశాలతో పోటీపడుతుందన్నారు. హెల్త్, ఫార్మా, ఐటీ, ఫుడ్ గ్రైన్స్ వంటి రంగాల్లో తెలంగాణ ది తిరుగులేని ప్రస్థాన మన్నారు.ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.ఒక్కో పాఠశాలను 25 ఎకరాల క్యాంపస్‌లో, ఒక్కో పాఠశాలను రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామన్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున 100 పాఠశాలలు మంజూరు చేశామన్నారు. గతంలో నిర్మించిన 100 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయని డిప్యూటీ సీఎం తెలిపారు.సీఎస్ఆర్ అంటే లాభాల్లో రెండు శాతం ప్రజాహిత కార్యక్రమాలకు కేటాయించడానికి చట్టపరమైన బాధ్యతగా చూస్తామన్నారు.పల్లెల్లో యువతకు గ్రీన్ స్కిల్ స్ లో శిక్షణ, మహిళా సంఘాలకు కేవలం నిధులు మాత్రమే కాకుండా యంత్రాలు, శిక్షణ, మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని ఒకేసారి నిధులు కేటాయించడం కాదు దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకులుగా మారుద్దాం అని డిప్యూటీ సీఎం అన్నారు. మీరు పని చేసే ప్రాంతాల్లో ప్రజల జీవన అనుభవాలను తెలుసుకోవాలని, స్థానిక ప్రజా సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. నిర్మించిన భవనాలు పాతవి అవుతాయి కానీ ప్రజల నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం వంటి అంశాలు నిరంతరం ప్రభావాన్ని చూపుతాయన్నారు. సీఎస్ఆర్ పథకం ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడేలా చేయాలే తప్ప చేతులు చాచేలా కాదన్నారు. స్వరాజ్య స్ఫూర్తితో స్వయం విశ్వాసంతో నడవాలి అని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.