నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ భూ అక్రమాల్లో మా ప్రమేయం లేదు
శకుని మామ డైరెక్షన్ లో డ్రామా రావుల నాటకం
ప్రభుత్వ ఆదరణ చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు
తమ తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే కుట్ర
ముద్ర, తెలంగాణ బ్యూరో :
శకుని మామ కేసీఆర్ డైరెక్షన్‌లో అబద్దాల హరీష్‌రావు, డ్రామారావు కేటీఆర్ లు తమ ప్రభుత్వం, మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దుయ్యబట్టారు. గత పదేళ్ల తమ పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ పథకాలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, పాత తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ భూ అక్రమాలపై హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా భూ అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. బుధవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నంప్రభాకర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సామెల్ , బి.లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్, రాంమోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. నాదర్‌గుల్ భూములకు సంబంధించి 2014లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసిందని ఆయన ఆధారాలు బయటపెట్టారు. హరీశ్ రావు ఆరోపిస్తున్న సర్వే నంబర్ 613లోని భూములను 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. భూముల మ్యుటేషన్ జరిగిన 2016లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా పాలన, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో వారి ప్రవర్తనను ప్రజలంతా గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని ఫైరయ్యారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే నాదర్‌గుల్ భూముల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే ఇటువంటి దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయంతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డిని, అలాగే మద్యం పాలసీ, టూరిజం పాలసీల విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కావాలనే టార్గెట్ చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. ప్రొహిబిటెడ్ భూముల్లో తమ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. హరీష్ రావు చెబుతున్న కంపెనీల్లో తమ కుటుంబ సభ్యులెవరూ లేరని అన్నారు. తన కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. సర్వే నంబర్ 613లోని భూములను 2014లోనే మూడు సంస్థలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిందని ఆధారాలతో సహా చూపుతానని అన్నారు. ఈ భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. నాలా కన్వర్షన్ విషయంలో సదరు సంస్థలు కోర్టుకు వెళ్తే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అవి ప్రభుత్వ భూములని కౌంటర్ దాఖలు చేసామన్నారు. గతంలో వాటాల ఒప్పందం చేసుకుని.. భూములు కట్టబెట్టి వాటాలు దక్కలేదని ఇప్పుడు తమపై నిందలు వేయడం సరైంది కాదని మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విమర్శించారు.