ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్ కర్నూల్‌లో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ గాంధీ పార్క్‌లో స్థానికంగా అమ్మవారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చిత్రపటాలకు ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా ఉండి, సమాజానికి ధర్మం, న్యాయం, అహింస మార్గాన్ని చూపిన మహనీయురాలని తెలిపారు. ఆమె జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని, దీని ద్వారా ఆర్యవైశ్యుల భావోద్వేగాలకు గౌరవం దక్కిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇచ్చే దిశగా ఇది ఒక మంచి అడుగని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలతో సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, హరిబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉజ్వల్ మహేష్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సంబు పాండు, అల్లంపల్లి శ్రీనివాసులు, సాయి శేఖర్, దివి నారాయణ, సాయి రాజా మరియు ఆర్యవైశ్య మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.